5, సెప్టెంబర్ 2012, బుధవారం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః..........

 పిల్లలూ!నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జన్మదినంకదా!ఈ రోజునే  మరొక పండుగకూడా ఉంది ఏమిటో చెప్పగలరా?అదే ఉపాధ్యాయ దినోత్సవం.అది డాక్టర్ సర్వేపల్లి వారి జన్మ దినం నాడే ఎందుకు చెయ్యాలి?మరొక రోజు చెయ్యవచ్చు కదా!అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.మరి దానికి నేను సమాధానం చెప్పాలి కదా! ఆయన శిష్యులు,మిత్రులు కొందరు డాక్టర్ సర్వేపల్లి గారి వద్దకు వెళ్ళి అయ్యా!మీ జన్మ దినోత్సవాన్ని మేము ఘనంగా వేడుకగా చెయ్యాలని అనుకుంటున్నాము.దానికి మీరు అనుమతించాలి అని అడిగారు.అదీ ఆయన 74 వ జన్మదినం.అంటే అది 5 సెప్టెంబర్ 1962 వ సంవత్సరం. దానికి ఆయన ఇలా అన్నారు."నా పుట్టిన రోజును అంత వేడుకగా జరపడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు.నేను మీకు అధ్యాపకునిగా చిర పరిచితుణ్ణి .కాబట్టి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేనెంతో గర్హిస్తాను"అని చెప్పి,ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను, గౌరవ భావాన్ని వ్యక్తం చేశారు.అదుగో !అది !ఆ దినం నుండి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.మరి ఆయన జన్మ దినమైన ఈ ఉపాధ్యాయ దినోత్సవ సమయాన వారిని గురించి,వారి గొప్పదనాన్ని గురించి,నాలుగు ముక్కలు మననం చేసుకోవడం మన విధి.
                  మద్రాసుకు 64 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి అనే ఒక ఊరుంది.ఆ ఊర్లో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలోవీరా స్వామి, సీతమ్మ పుణ్య దంపతులకు ది.5 సెప్టెంబర్ 1888 వ తేదీన జన్మించారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్.వీరి మాతృభాష మన తెలుగే !బాల్యం అంతా తిరుత్తణి,తిరుపతి పట్టణాల్లోనే సాగింది.మద్రాసులో స్నాతకోత్తర  విద్యను,M.A పట్టాను పొందిన వీరికి చిరు ప్రాయంలోనే అంటే 18 సం.ల వయస్సు లోనే అంటే 1906లోశివ కామమ్మ గారితో వివాహం అయింది.వీరికి 5గురు కుమార్తెలు,ఒకే ఒక్క కుమారుడు సంతానంగా కలిగారు.
                            క్రమంగా తత్వ వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టి అధ్యాపక వృత్తిలోకి అడుగు పెట్టారు.వారి ప్రతిభా పాటవాలను ఇనుమడింపచేసుకున్న వీరిని ,ఎన్నెన్నో అత్యున్నత పదవులు కోరకుండానే వెతుక్కుంటూ వచ్చాయి.ఒక అధ్యాపకునిగా వీరు చేపట్టిన పదవులు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది.మదన మోహన మాలవ్యా అడుగుజాడల్లో బనారస్ విశ్వ విద్యాలయానికి కులపతిగా,వాల్తేరులోని మన ఆంధ్ర విశ్వ విద్యాలయ కులపతిగా,  కలకత్తా విశ్వ విద్యాలయ రూపకర్తగా,ఆక్స్ఫర్డ్  విశ్వ విద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యునిగా ఎనలేని గౌరవాన్ని,ఎందరెందరో గొప్ప గొప్ప శిష్యులను తన ఆస్తిగా సంపాదించుకున్నారు.1954లొ"భారత రత్న" అయ్యారు.1951 లో యునెస్కో రాయబారిగా వెళ్ళారు.జర్మన్ శాంతి బహుమతిని గుడా పొందిన వీరి మొట్టమొదటి రచన "ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్"ఇలాంటి వెన్నోఎన్నెన్నో వారి రచనలు భారతీయ సరస్వతికి కంఠాభరణాలు  అయ్యాయి.
                           కలకత్తా విశ్వ విద్యాలయంలో కింగ్ జార్జ్ చైరును అలంకరించిన తొలి భారతీయుడు మన డాక్టర్ సర్వేపల్లి. తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా,మహా పండితునిగా,ఉన్న మన రాధా కృష్ణునికి  1931 లో నైట్ హుడ్ ఇచ్చి గౌరవించారు.అప్పటి నుండి సర్ బిరుదు చేర్చి పిలువబడుతూ ఉండేవాడు.అలాగే రష్యా అధినాయకుడైన స్టాలిన్ కు తత్వాన్ని,జ్ఞానోపదేశం చేసి ఘనత మన డాక్టర్ సర్వేపల్లికి దక్కింది.
                                        రాజనీతికోవిదుడైన మన
డాక్టర్ సర్వేపల్లి స్వాతంత్ర్యా నంతరం మొట్ట మొదటి ఉప రాష్ట్ర పతి పదవి,ఆ తరువాత రాష్ట్ర పతి పదవి వీరిని వరించింది.వారికి గౌరవ సూచకంగా మన రాజధాని నగరంలో ట్యాంక్ బండ్ మీద వీరి శిలా మూర్తి ప్రస్ఫుటంగా చూపరులకు మనకు కనువిందు చేస్తూ ఉంటుంది. మూర్తీ భూత భారతీయ సంస్కృతి,వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి డాక్టర్ సర్వేపల్లి. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అంటరు సర్వేపల్లి. ఎంత గొప్ప స్థానాన్ని చేరినా సరే!విద్యార్ధిగా ఉండు!అంటారు వారు. అలాగే ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము.ప్రేమాభిమానాలతోనే చల్లార్చ గలమంటారు.అలాంటి మన సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని గూర్చి ఎంత చెప్పుకున్నా తరగని చరిత్ర వారిది.అలాంటి వారి జన్మ దినాన్ని ఈనాడు వారి కోరినట్లు ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా ఘనంగా జరుపుకోవడం నిజంగా వారి గొప్ప మనసుకు నిదర్శనం. వారి అడుగు జాడల్లో మనమందరం నడుస్తూ ,మీ మీ ఉపాధ్యాయుల్ని వారి సేవలను,కొనియాడుతూ మీ గురుభావాన్ని ప్రకటించుకుంటారని మనసా వాచా కర్మణా ,కోరుతూ వారి అడుగుజాడల్లో మీరంతా గొప్పవారు కావాలని కోరుకుంటూ,వారికి నా వినమ్ర ప్రణామాలను అందజేస్తూ,నా గురుదేవులందరికి, పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపు కుంటున్నాను.
                                                                   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి