26, డిసెంబర్ 2012, బుధవారం

ఆరనీకు!.....మన తెలుగు వెలుగు......!

మన తెలుగు నసిస్తోంది అంటూ ముక్కున వేలేసుకొని మరీ స్పందించే ప్రతి వ్యక్తీ "దానికి కారణం మనమే"అనే నగ్న సత్యాన్ని గుర్తించాలి

సుమించి పరిమళించే మన తెలుగు వృక్షాన్ని వ్రేళ్ళతో సంబంధాలు లేకుండా చేస్తున్నది అక్షరాలా నేటి మన మమ్మీ డాడీలే! వీరి వైఖరిలో మున్ముందు మార్పు రావాలి."నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం"అంటూ చిన్న తనం నుంచీ చేసిన ప్రతినలు నిజం చేయాలి.


8, డిసెంబర్ 2012, శనివారం

బహుమతి ప్రదానోత్సవం

ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహాణలో భాగంగా నిన్న కవితల పోటీలో గెలుపొందిని మా పాఠశాల విద్యార్ధిని అందుకున్న బహుమతి చిత్రాలు.నేటి విద్యార్ధినీ విద్యార్ధులకు స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ఆ చిత్రాలను వెలువరిస్తున్నాను.
సభావేదికనలంకరించిననరసాపురం  రెవిన్యూ డివిజనల్ అధికారి,పాలకొల్ కమీషనర్,మరియు మండలాభివృద్ధి అధికారివారలు.


పాలకొల్లు మండలాభివృద్ధి అధికారి మరియు స్పెషల్ ఆఫీసర్ నరస రాజు  హరితకు బహుమతిని అందజేస్తున్న చిత్రం

7, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలుగు మహా సభల సందర్భంగావివిధ పోటీలలో వి జే త లు

మండల స్థాయి కవితల పోటీలో గెలుపొందిన మాపాఠశాల చిరంజీవిని దేవాడ హరిత
పాలకొల్లు మండల స్థాయి పోటీల నిర్వహణను సమీక్షిస్తున్నమునిసిపల్  కమీషనర్,
మండల విద్యాశాఖాధికారి శర్మగారు,మరియు వివిధ పోటీల న్యాయనిర్ణేతల సమావేశం
ప్రపంచ తెలుగు మహాసభా నిర్వహణలో భాగంగా ఇటీవల మండల స్థాయిలో వ్యాస రచన,వక్తృత్వం,చిత్ర లేఖనం,పద్య పఠనం,స్వీయ కవితా రచన,మొదలైన పోటీలలో పాల్గొన్న మా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు.వీటిలో డి.హరిత 10వ తరగతి అమ్మాయి మండల స్థాయి కవితల పోటీలో ప్రధమ స్థానాన్ని పొంది,డివిజన్ స్థాయికి ఎంపిక కాబడింది.ఇది మా పాఠ శాలకు ఎంతో గర్వకారణమని ఇటీవలే నూతన ప్రధానోపాధ్యాయునిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన కుమార్ గారు మరియు ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం హరితను అభినందనల వర్షంలో ముంచెత్తారు.ఆ చిత్రాలివి.
చిరంజీవులు -సుకుమార్, పృధ్వి రాజ్, దుర్గ, దేవాడ హరిత, సునీత, హేమశ్రీ,  లక్శ్మీదుర్గ.

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కృతజ్ఞుడు-కృతఘ్నుడు

కృతజ్ఞుడు అనగా చేసిన మేలు మరువని వాడు.అలాగే కృతఘ్నుడు అంటే చేసిన మేలు మరచిపోయేవాడు.మరి ఈ ఇద్దరికి భేదం తెలుసు కొనేలా ఒక కధ ఉంది                         
             ఒక ఊరిలో ఒక రాజు గారున్నారు.ఆయనని కొందరు కృతజ్ఞుడు అంటున్నారని, మరికొందరు కృతఘ్నుడు అనుకుంటున్నారని  చారులు తెలిపారు.రెండు పదాలూ ఇంచు మించు ఒకేలా మనందరికీ కనపడుతున్నా,అసలీ కృతజ్ఞుడు-కృతఘ్నుడు అనే పదాలకు అర్ధం ఆ రాజుకు మాత్రం సరిగా తెలవలేదు.తెలుసు కోవాలనే అతని మనస్సులో కుతూహలం.వేంటనే తన మంత్రిని కేకవేశాడు."నాకు ఈ రెండు పదాలకి అర్ధం సరిగా అర్ధం అయ్యేలా,ప్రత్యక్ష పూర్వకంగా రేపు నువ్వు! దీన్ని  నిరూపించడానికి ఆధారాలేమైనా తీసుకురా"అని ఆజ్ఞ జారీ చేశాడు. చిత్తం!మహ ప్రభో!అని పైకి అన్నాడేకాని,లోలోన కుములుతున్నాడు, ఏమి తేవాలో ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో అని.అదే ఆలోచనతో ఇంటికి వచ్చాడు.తెగ ఆలోచిస్తున్నాడు.ఆధారం ఏదీ ఎంత ఆలోచించినా దొరకలేదు.రేపు రాజు గారితో తన పనిఅయిపోయినట్లే!అని మనసులో కొంచెం భయం కూడా పట్టుకుంది.తల బ్రద్దలు కొట్టుకుంటున్నాడు.ఇలా ఉండగా ఆ మంత్రి గారికి ఎంతో తెలివైన ఒక కూతురుంది.తండ్రి డీలా పడి ఉండడాన్ని మొఖంలోనే గమనించి కారణం తెలుసుకుంది.                                          "ఓస్!ఇంతేనా!దానికి అంత తల కొట్టేసు కోసుకోవలసిన పనిలేదు.రేపు మన పెంపుడు కుక్కను,మీ అల్లుడు గార్ని రాజ సభకు తీసుకెల్లండీ!మీ సమస్య చాలా సులభంగా పరిష్కారం అవుతుంది" అని చెప్పి హాయిగా నిద్ర పొమ్మన్నది.
                                    మన మంత్రి గారికి,తన కూతురి ద్వారా అలా మంచి ఆధారం ఇంత సునాయాసంగా దొరకడంతో హాయిగా నిద్ర పోయాడు.మరునాడు ఎప్పటిలా తెల్ల వారింది.తన పెంపుడు కుక్కను, తన అల్లుణ్ణి,రాజ సభలో ప్రవేశపెట్టి ఇలా అన్నాడు."అయ్యా!మీరు తీసుకుని రమ్మన్నఆధారాలు తీసుకొని వచ్చాను"అన్నాడు.అక్కడకు తెచ్చిన ఆ ఆధారాలను చూసి,మంత్రి తనను ఎగతాళి చేస్తున్నాడని రాజు గారికి కోపం వచ్చింది.అప్పుడు మంత్రి,రాజుతో ఇలా అన్నాడు.....

                              "మహా రాజా!ఈ ప్రాణికి ఎంత పెట్టినా "సంతృప్తి" అనేదే లేదు. ఇతని దాహం తీరదు.విశ్వాసం లేదు. మహా రాజా!ఒక విధంగామీరూ,నేనూ కూడా ఒకప్పటి ఒక ఇంటి అల్లుళ్ళమే కదా!మన అత్త మామలు మనకు చేసిన మేలు అప్పుడే,మరచిపోయాము.మరి!ఈ కుక్కను చూడండి! ఇది మాత్రం ఏది పెడితే,అది తింది.ఎంతో విశ్వాసం తోఉంది.నేటికీ మన ఇంటికి కావలి కాస్తూనే ఉంది"అన్నాడు.
                          మంత్రి గారి సమాధానం ఆ రాజుకు చాలా బాగా నచ్చింది.ఇంత గొప్పగా చెప్పిన మంత్రిని ఎంతో ఘనంగాసత్కరించాడు. నిజానికి ఆ సన్మానం దక్క వలసింది తన కూతురుకేనని మనస్సులో భావించాడు ఆ మంత్రి.మనం పరులు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మరువకూడదని,అలాంటి వాడు కృతజ్ఞుడని,చేసిన మేలు కాస్తా మరచి పోయినవాడు
కృతఘ్నుడనీఆ రాజు ఈ విధంగా తెలుసు కోగలిగాడు. అలా అక్షరాల్లో కొద్ది తేడాతో కనపడుతున్నా ఈ రెండు పదాలకూ ఎంత భేదముందో!

17, సెప్టెంబర్ 2012, సోమవారం

నేటి తల్లి దండ్రుల బాధ్యత

చాలా మంది తల్లిదండ్రులు ఈనాడు మా పిల్లలు మంచి సాహిత్యం, చదవాలి .వారిలో మానవతా విలువలు ,సాంస్కృతిక విలువలు పెరగాలి,ఆధ్యాత్మిక చింతన ప్రబలాలి, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక విలువలతో  మా  బిడ్డల శీల సంపదలు ఇనుమడింప చేయాలనే భావనే కానీ , అవి పెంపొందించడానికి మన వంతుగా ,మనమెంత కృషి చేస్తున్నాము?అనే ప్రశ్న నేటి సమాజంలోని ప్రతి తల్లీ,తండ్రి వేసుకో వలసిందే!మన వంతు బాధ్యతలను మనం సక్రమంగా ఎంత వరకూ నిర్వర్తిస్తున్నామా?అని !ఈ నాడు మేము నవ నాగరికులమని బోర విరుచుకొని చెప్పుకుంటున్న,వారి గృహాలు ఎక్కడ చూసినా ,సెక్స్ సాహిత్యం ,క్షుద్ర సాహిత్యం ,అర్ధ నగ్న దృశ్యాలతో కూడిన పనికి మాలిన  సాహిత్యం ,డిటెక్టివ్ -నవలా సాహిత్యంతో,నిండి పోతూనే ఉందనే విషయం నేడు ఎవరూ కాదనలేరుగా?మరి !మన భావి తరాలెలా?తీర్చి దిద్దబడతారు?మనసు పెట్టి,కొంచెం ఆలోచించండి! సంస్కృతం,తెలుగు వంటి మన ప్రాచీన భాషలు పూర్తిగా మనకే రాక పోవచ్చును.నేర్చుకోవాలనే కోరిక  మరియు అభిలాష కొందరికి  ఏకోశానా లేకపోవచ్చును.మహాను భావులు ఎందరో మన కవులు ఎంతో పరిశ్ర మించి,కేవలం తెలుగు వచనంలోకి అనువదించిన అద్భుతమైన పూర్వ కావ్యాలు ఎన్నిలేవు?పురాణాలెన్ని లేవు? వాటిని కొంచెం సేపైనా ప్రతి రోజూ చదివించ వచ్చుగా?వాటిలో కొన్నైనా , అధమ పక్షం ఇంట్లోనైనా కొని, మన బిడ్డ చూసేలా ఉంచవచ్చుగా! గృహమొక పవిత్రమైన గ్రంధాలయంగా చేసుకోవచ్చుగా!వాటిని కొని ఇంట్లో ఉంచితే ఎప్పుడైనా ఒకసారి కాకపోతే వొకసారైనా ,వాడు తెరచి చూచే అవకాశం మనం కల్పించవచ్చుగా!భావి తరాలకు మంచి పుస్తకాలు ,సంస్కృతీ సాంప్రదాయాలు ,పుణ్య పురుషుల చరిత్రలు , అందించి,మన జాతిని జాగృతం చేసుకుందాం!ఇది తల్లి దండ్రుల మైన మనందరి బాధ్యతగా గుర్తెరిగిన వారు ధన్యులు.అందరినీ ఉద్దేసించి చెప్పిన విషయాలుగా భావించకండి!కొన్నిగృహాలు ఇందుకు భిన్నంగా మన ప్రాచీన ఆర్ష సాంప్రదాయపు ఒరవడిలో ఉండి ఉండవచ్చుకూడా ! అలాంటి వారికి నా జోహారులు.మన బిడ్దల నైతిక విలువల కోసం వేసవి ప్రత్యేక తరగతుల కోసం వేలకు వేలు ఫీజులు పోస్తున్నాం!వారిని ఉద్దేసించి మాత్రమే నా బాధ !మన్నిస్తారుగా!

5, సెప్టెంబర్ 2012, బుధవారం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః..........

 పిల్లలూ!నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జన్మదినంకదా!ఈ రోజునే  మరొక పండుగకూడా ఉంది ఏమిటో చెప్పగలరా?అదే ఉపాధ్యాయ దినోత్సవం.అది డాక్టర్ సర్వేపల్లి వారి జన్మ దినం నాడే ఎందుకు చెయ్యాలి?మరొక రోజు చెయ్యవచ్చు కదా!అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.మరి దానికి నేను సమాధానం చెప్పాలి కదా! ఆయన శిష్యులు,మిత్రులు కొందరు డాక్టర్ సర్వేపల్లి గారి వద్దకు వెళ్ళి అయ్యా!మీ జన్మ దినోత్సవాన్ని మేము ఘనంగా వేడుకగా చెయ్యాలని అనుకుంటున్నాము.దానికి మీరు అనుమతించాలి అని అడిగారు.అదీ ఆయన 74 వ జన్మదినం.అంటే అది 5 సెప్టెంబర్ 1962 వ సంవత్సరం. దానికి ఆయన ఇలా అన్నారు."నా పుట్టిన రోజును అంత వేడుకగా జరపడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు.నేను మీకు అధ్యాపకునిగా చిర పరిచితుణ్ణి .కాబట్టి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేనెంతో గర్హిస్తాను"అని చెప్పి,ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను, గౌరవ భావాన్ని వ్యక్తం చేశారు.అదుగో !అది !ఆ దినం నుండి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.మరి ఆయన జన్మ దినమైన ఈ ఉపాధ్యాయ దినోత్సవ సమయాన వారిని గురించి,వారి గొప్పదనాన్ని గురించి,నాలుగు ముక్కలు మననం చేసుకోవడం మన విధి.
                  మద్రాసుకు 64 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి అనే ఒక ఊరుంది.ఆ ఊర్లో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలోవీరా స్వామి, సీతమ్మ పుణ్య దంపతులకు ది.5 సెప్టెంబర్ 1888 వ తేదీన జన్మించారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్.వీరి మాతృభాష మన తెలుగే !బాల్యం అంతా తిరుత్తణి,తిరుపతి పట్టణాల్లోనే సాగింది.మద్రాసులో స్నాతకోత్తర  విద్యను,M.A పట్టాను పొందిన వీరికి చిరు ప్రాయంలోనే అంటే 18 సం.ల వయస్సు లోనే అంటే 1906లోశివ కామమ్మ గారితో వివాహం అయింది.వీరికి 5గురు కుమార్తెలు,ఒకే ఒక్క కుమారుడు సంతానంగా కలిగారు.
                            క్రమంగా తత్వ వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టి అధ్యాపక వృత్తిలోకి అడుగు పెట్టారు.వారి ప్రతిభా పాటవాలను ఇనుమడింపచేసుకున్న వీరిని ,ఎన్నెన్నో అత్యున్నత పదవులు కోరకుండానే వెతుక్కుంటూ వచ్చాయి.ఒక అధ్యాపకునిగా వీరు చేపట్టిన పదవులు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది.మదన మోహన మాలవ్యా అడుగుజాడల్లో బనారస్ విశ్వ విద్యాలయానికి కులపతిగా,వాల్తేరులోని మన ఆంధ్ర విశ్వ విద్యాలయ కులపతిగా,  కలకత్తా విశ్వ విద్యాలయ రూపకర్తగా,ఆక్స్ఫర్డ్  విశ్వ విద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యునిగా ఎనలేని గౌరవాన్ని,ఎందరెందరో గొప్ప గొప్ప శిష్యులను తన ఆస్తిగా సంపాదించుకున్నారు.1954లొ"భారత రత్న" అయ్యారు.1951 లో యునెస్కో రాయబారిగా వెళ్ళారు.జర్మన్ శాంతి బహుమతిని గుడా పొందిన వీరి మొట్టమొదటి రచన "ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్"ఇలాంటి వెన్నోఎన్నెన్నో వారి రచనలు భారతీయ సరస్వతికి కంఠాభరణాలు  అయ్యాయి.
                           కలకత్తా విశ్వ విద్యాలయంలో కింగ్ జార్జ్ చైరును అలంకరించిన తొలి భారతీయుడు మన డాక్టర్ సర్వేపల్లి. తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా,మహా పండితునిగా,ఉన్న మన రాధా కృష్ణునికి  1931 లో నైట్ హుడ్ ఇచ్చి గౌరవించారు.అప్పటి నుండి సర్ బిరుదు చేర్చి పిలువబడుతూ ఉండేవాడు.అలాగే రష్యా అధినాయకుడైన స్టాలిన్ కు తత్వాన్ని,జ్ఞానోపదేశం చేసి ఘనత మన డాక్టర్ సర్వేపల్లికి దక్కింది.
                                        రాజనీతికోవిదుడైన మన
డాక్టర్ సర్వేపల్లి స్వాతంత్ర్యా నంతరం మొట్ట మొదటి ఉప రాష్ట్ర పతి పదవి,ఆ తరువాత రాష్ట్ర పతి పదవి వీరిని వరించింది.వారికి గౌరవ సూచకంగా మన రాజధాని నగరంలో ట్యాంక్ బండ్ మీద వీరి శిలా మూర్తి ప్రస్ఫుటంగా చూపరులకు మనకు కనువిందు చేస్తూ ఉంటుంది. మూర్తీ భూత భారతీయ సంస్కృతి,వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి డాక్టర్ సర్వేపల్లి. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అంటరు సర్వేపల్లి. ఎంత గొప్ప స్థానాన్ని చేరినా సరే!విద్యార్ధిగా ఉండు!అంటారు వారు. అలాగే ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము.ప్రేమాభిమానాలతోనే చల్లార్చ గలమంటారు.అలాంటి మన సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని గూర్చి ఎంత చెప్పుకున్నా తరగని చరిత్ర వారిది.అలాంటి వారి జన్మ దినాన్ని ఈనాడు వారి కోరినట్లు ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా ఘనంగా జరుపుకోవడం నిజంగా వారి గొప్ప మనసుకు నిదర్శనం. వారి అడుగు జాడల్లో మనమందరం నడుస్తూ ,మీ మీ ఉపాధ్యాయుల్ని వారి సేవలను,కొనియాడుతూ మీ గురుభావాన్ని ప్రకటించుకుంటారని మనసా వాచా కర్మణా ,కోరుతూ వారి అడుగుజాడల్లో మీరంతా గొప్పవారు కావాలని కోరుకుంటూ,వారికి నా వినమ్ర ప్రణామాలను అందజేస్తూ,నా గురుదేవులందరికి, పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపు కుంటున్నాను.
                                                                   

1, సెప్టెంబర్ 2012, శనివారం

"దండం దశ గుణం భవేత్"

ఇటీవల ఒక మిత్రుడు తన మాటల్లో,"దండం దశ గుణం భవేత్" అంటారు గదా!దండం పెట్టడం పది రకాలట గదా ! అ దండాల గురించి కొంచెం చెపుతారా ? అని నా మీద,ఒక ప్రశ్నా బాణాన్ని సంధించాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది!ఇదేమిటి? దండం ఏమిటి ?పది రకాలేమిటి?అని.ఆతను భావించినట్లుగా ,ఇక్కడ" దండం " అంటే, మీరు కూడా నమస్కారం అనుకుంటారేమో?ఇక్కడ "దండం "అంటే,"చేతి కర్ర" అని అర్ధం."దండ ప్రమాణం" అనే మాట కూడా ఇందులోంచి వచ్చినదే! ఇది పూర్వ కాలం గురువుల చేతుల్లో,ఎక్కువగా చిన్న సైజులో కనుపించేది.దాన్ని" బెత్తం " అని మా రోజుల్లో పిలిచేవారు.అలాగే , చిన్నికృష్ణుడు  గోవులను మేపుతూ,విమల శృంగము,వేత్ర దండము ధరించాడని,పోతన మహా కవి భాగవతంలో వర్ణించాడు కూడా .మా రోజుల్లో విద్యార్ధులకు, సగానికి సగం, క్రమశిక్షణ దీని ,ద్వారానే అలవడేది.అంటే! మీరు నమ్ముతారా?భయానికి మారు పేరుగా ఈ దండం..నాడు ఉపాధ్యాయుల చేతుల్లో,తరచూ ఇది కనుపిస్తూ ఉండేది.
                                    ఇప్పుడు దీని పేరెత్తినా,ఇది చేతిలో కనిపించినా, ఉపాధ్యాయులను శిక్షించమని! ప్రభుత్వం వారు ఉత్తర్వులు దఖలు పరిచారు.అది వేరే విషయం అనుకోండి!.అలా అంటే,మీ వంటివారు కూడా,ఎంతమంది ఉపాధ్యాయులు బిడ్డల్నిశిక్షించడం లేదు ?ఎన్ని కేసులు చూడడం లేదు? అంటూ నన్ను ప్రశ్నిస్తారు.ఐతే ఇక  అసలు విషయానికి వద్దాం!ఈ" కర్ర " మనకు సన్యసించిన ,స్వామీజీల, అవధూతల,అఘోరాల, చేతిలో,పొడవైన దండం లాంటిది,మనం చూస్తూ ఉంటాం.దానికి కాషాయ వస్త్రాలు కూడా చుట్టి ఉంటాయి.అందుకే వారిని" త్రిదండి "వంటి గౌరవ పదాలను ముందుంచి, పిలుస్తూ ఉంటాము.వారి మనో, వాక్, కాయ రూపాలను ఈ దండంగా  భావించి,మనం ఈ పేరుతొ గౌరవిస్తూ ఉంటాం.మనం వారికి చేసే,ప్రతీ నమస్కారమూ, ఈదండం ద్వారా భగవంతునికి చేరుతుందని,భక్తుల నమ్మకం.ఇలా చెప్పుకుంటూ పోతే... ఈ దండం,మనకు 10 రకాలుగా నిత్య జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది.కాబట్టే 
" దండం దశ గుణం భవేత్" అనే వాక్యం వచ్చింది.ఆ పది ఉపయోగాల లోక భావాన్ని కలిగిన,ఒక  చిన్న శ్లోకాన్నిఇక్కడ మనం ముచ్చటించుకుందాం.
                                           "  విశ్వా~మిత్రా~హి, పశుషు,
                                                కర్దమేషు ,జలేషు చ,
                                                 అంధే,తమసి వార్ధక్యే,
                                                 దండం దశ గుణం భవేత్."
 అంటే!నిత్య జీవితంలో,మానవునికి ఈ దండం అనేది 10 రకాలుగా  ఉపయోగపడుతోంది.
1. "వి "=అనగాపక్షులను,అదలించడానికి,
2" శ్వ" =అనగా కుక్కలను ,బెదరించడానికి,
3. "అమిత్ర "=అనగా శత్రువులనుండి ఆత్మ రక్షణ పొందడానికి,
4. "అహి "=అనగా పాములనుండి,రక్షణ పొందడానికి,
5."పశుషు "=పశువులను,అదలించడానికి,
6 "కర్దమేషు "=అనగా బురద వంటి ప్రదేశాల్లో, పడకుండామన కాపుకోసం,
7. "జలేషు "=జలాలలో దిగినప్పుడు,లోతు,తెలుసుకోవడానికి,
8." అంధే"=కనుచూపు లేనివారికి,ఊతగాను
9. "తమసి "=చీకటిలో ,రక్షణగాను,
10."వార్ధక్యే "=ముసలితనంలో ,ఊతంగాను,
ఇలా ఈ దండాన్ని ఉపయోగించుకోవచ్చును.అని చెబుతాం.ఈ దశ గుణాలను మనం రోజూ అనుభవిస్తూ ఉన్నా,ఆ విషయాన్ని వదిలేసి,కేవలం నేడు" వీధిజనభయంకరుల " చేతుల్లో,ఆయుధాలుగా మాత్రమే మనం ఊహించుకుంటూ, ఈ దండానికి మనమే,విపరీతార్ధాలుతీస్తున్నా,ఈ అసలు అర్ధాలను గమనించమని నా మిత్రునితో చెప్పిన విషయం, అందరికీ  ఉపయోగిస్తుందని మీతో ఈ రోజు ఇలా ప్రస్తావించాను.ఇందులోని మంచిని గ్రహించండి.చెడునివిసర్జించండి.

31, ఆగస్టు 2012, శుక్రవారం

మన జిల్లా కలెక్టర్ మరియు మన జిల్లా విద్యా శాఖాధికారి

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్న చేస్తున్న అధికారులు అనధికారులు
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్న చేయిస్తున్నమన జిల్లా కలెక్టర్ మరియు అధికారులు
  మన జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ ఆర్.నరసింహా రావు, M.A,B.Ed

29, ఆగస్టు 2012, బుధవారం

అబ్రహం లింకన్ ఉపాధ్యాయులకు వ్రాసిన లేఖ

                  అబ్రహం లింకన్ ఉపాధ్యాయులకు వ్రాసిన లేఖ
ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు.
కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయివాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను.
ఈరోజు వాడికి ఒక సాహసం వంటిదిఈసాహాసం వాడికి ఖండ ఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు.చరిత్రలో సాహసాలు రాజ్యాలనీయుద్దలనీ వేదననీ మాత్రమే మిగిల్చాయి.కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికిఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకంప్రేమదైర్యం అవసరం.
 ప్రియమైన ఉపాధ్యయులారానా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండికానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ
మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ వాడు నేర్వాలని నాకు తెలుసు.కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని
ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి
ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండిమాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి
ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నాసొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి.
మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి
సాద్యమైతే పుస్తకాలువాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి
అయితే అదే సమయంలో...
ఆకాశంలోని  పక్షులలోఎండలోని తేనటీగల్లోపచ్చని కొండల్లోని పువ్వులలో
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి.
ప్రకృతిని వాడు ఆరాదించిఆస్వాదించే మనస్సుని పెంచండి

వంచనకన్న ఓటమి మంచిదనిగొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి
దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు  విలువ ఎక్కువని వాడికి చెప్పండి
వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి
వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే
సున్నితస్తులతో సున్నితంగామొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి
అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు
గుడ్డిగా అనుసరించక ప్రకక్కు నిలబడగలిగినిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండిఎవరు ఏది చెప్పిన, వినడాన్ని భోదించండి అయితే విన్న అన్నిటినిసత్యపు జల్లెడలో వడకట్టి, 
పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.
మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి
ఓటమిని-గెలుపునిసుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి
కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి
వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి
అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి
అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి
కానీ వాడి హృదయంపైనఅత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.
సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు
లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండాదైర్యంగా నిలబడటాన్నిపోరాడటాన్నిభోదించండి
వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండిసున్నితంగా ప్రవర్తించండిఅలా అని గారాభంఎత్తుకు తిప్పటం  చేయకండి
వాడికి తప్పు అంటే భయం నేర్పండివీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి
ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి
అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది.
ఇవ్వన్ని వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.
ఇదంతా పెద్ద పట్టికేతండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక.. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను.
కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి,,, వాడు ఒక పసిపిల్లవాడుమనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు
జాగ్రత్తగా చూసుకోండి....

15, ఆగస్టు 2012, బుధవారం

మా పాఠశాలలో జరుపుకున్న66 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల చిత్రా మాలిక

              స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు
తరగతి గదుల అలంకరణ

తరగతి గదుల అలంకరణ

తరగతి గదుల అలంకరణ

జాతీయ పతాకావిష్కరణ

అల్లూరి విగ్రహ పూజ

స్వాతంత్ర్య దినోత్సవ సభ

పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు

స్వాగత గీతాలాపన

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

తిలకిస్తున్న విద్యార్ధినీ విద్యార్ధులు

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

       2011-12 పదవ తరగతి ప్రతిభామూర్తులకు సన్మానం

                       2011-12 పదవ తరగతి                                            ప్రతిభామూర్తులకు సన్మానం

3, జులై 2012, మంగళవారం

వసుధ ఫౌండేషన్ పురస్కారాలు

వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వెంకట్రామ రాజుగారితో వరుసగా సోమార్క, భవాని, ప్రియాంక, ప్రసన్న, పద్మ
మరియు EX జిల్లా విద్యా శాఖాధికారి  ప్రసాద రాజు గారు
,

                                                      వసుధ ఫౌండేషన్ పురస్కారాలు
ఇటీవలి 2012 విద్యా సంవత్సరంలో అత్యధిక శ్రేణిలో గ్రేడులు సాధించిన  మా పాఠశాల విద్యార్ధినులకు 5 గురికి వసుధ ఫౌండేషన్ వారు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.ఆ కార్యక్రమం లోని చిత్రాలు, మా పాఠ శాల విద్యార్ధినులతో వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వెంకట్రామ రాజు గారితో మా విద్యార్ధినులు.

12, జూన్ 2012, మంగళవారం

"సులభంగా డబ్బు సంపాదించే మార్గం"

 ఈ రోజుల్లో ఇంట్లో కూర్చుని,లక్షలు సంపాదించాలనే,దురాశాపరులు ఎందరో ఉన్నరు.పైసా పెట్టుబడి లేకుండా సంపాదించడం ఎలాగా?అనేదే వారి ఆలోచన.బజార్లో 30 రూపాయలకు దొరికే ఒక వస్తువు వెలను 50రూ. చేసి 10రూ.."ఉచిత గిఫ్ట్" ఇస్తే చాలు !ఎగబడి మరీ కొంటారు.అందులో ఉండే అసలు విషయం గురించి చదువుకున్న వారు, చదువుకొన్నవారు అసలు ఆలోచించరు.కూడా ! అంటే నమ్మండి. మరికొందరు ఒకటి కొంటే!మరొకటి ఉచితం అని చెపితే చాలు !మళ్ళీ దొరకవేమోనని అప్పు చేసి మరీ ఒక్క సారే కొనేసే ఘనులున్నరంటే! ఆశ్చర్యపోనవసరం లేదనుకుంటాను ఈ రోజుల్లో.
                                  వెనుకటికి ఒక తెలివైన వ్యక్తి, "సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెపుతాను.ఈ క్రింది చిరు నామాకు 5 రూ..స్టాంపు పంపవలసింది" అని ఒక ప్రముఖ దిన పత్రికలో ప్రకటన ఇచ్చాడు.ఇక చూసుకోండి !ఆ ప్రకటన చూసిన చిన్న,చితక,ముసలి.ముక్క అందరికీ నోరూరింది.డబ్బెవరికి చేదు చెప్పండి?ఒక వారం గడిచేటప్పటికి 5 రూ..స్టాంపుతో బాటు స్వంత చిరునామా గల కవర్లు ఆ చిరునామా దారునకు అందడం మొదలు పెట్టాయి.ఇలా కొన్ని నెలలు,పాటు కవర్లు వస్తూనే ఉన్నాయి.రెండు కాదు,ఆరు నెలల వరకు ఈ ప్రవాహానికి హద్దూ ,ఆపూ,లేదు.ఆ చిరునామాదారు ఆ స్టాంపులు కవర్లు అమ్ముకొని లక్షాధికారి ఐపోయాడు.
                                సులభ సంపాదనతో తులతూగే వానికి మళ్ళీ కవర్లు రావడం ప్రారంభమైంది.ఈ సారి "సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెపుతానన్నారు.మేము స్టాంపులు పంపినా మీ నుండి సమాధానమే లేదు వెంటనే పంపండి"అంటూ ఉత్తరాల వెల్లువ ప్రారంభమైంది. మన తెలివైన సంపాదనా పరుడు తక్కువ తిన్నాడా? మళ్ళీ అదే దిన పత్రికలో,ఇలా మరో ప్రకటన ఇచ్చాడు
                    ."ప్రియ పాఠకులారా !సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెపుతానన్నాను.నా ప్రకటనకు మీరంతా వెల్లువలా స్పందించారు. కాబట్టే నేనీనాడు సులభంగా లక్షాధికారినయ్యాను.మరి ఈ రోజు మళ్ళీ డబ్బు సంపాదించే మార్గం చెప్ప లేదని వ్రాస్తారేమిటి ?ఇంకేం  మార్గం చెప్పాలి ?ఇదే సులభంగా డబ్బు సంపాదించే మార్గం.నేను చెప్పిన ఈ మార్గం సుసంపంన్నం చేసినందుకు మీకు మరో మారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను"అని
                             అదండీ !అసలు కథ అందుచేత ప్రియ వినియోగ దారులారా! లాభం లేకుండా ఏదీ ఉచితంగా ఇవ్వరని మనసు పెట్టి ఆలోచించండి!!!.ఆఫర్లు,ఫ్రీలు,అధిక శాతాలు, ఇవన్నీ పాత నిల్వలు తరగడానికీ, క్రొత్త నిల్వలు పెరగడానికి,చేసే చిట్కాలని గ్రహిస్తారుగా! నిజానికి మనం ధరలు మారుతతుల్యవేగంగా ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో.ఏదీ  "ఉచితం" అనుకోవడం "అనుచితం" కాబట్టి బ..హు... ప...రాక్.............
       (ఇందు లోని భావాలు !!!! ఎవరినీ ఉద్దేసించినవి !!!!!కావు )

3, జూన్ 2012, ఆదివారం

coat has gone out, in search of boot.

                   ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తించారా?ఆయనే మన   "ఆంధ్ర రత్న " శ్రీ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారు, భారతీయ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో పేరు పడ్డ వారు."చీరాల -పేరాల " వంటి ప్రముఖ ఉద్యమాల రధ సారధి.వారిని గూర్చిఒక చిన్నహాస్య సన్నివేశాన్నినేడు ముచ్చటించుకుందాం.. 
శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు,చిన్ననాటి నుంచీ,సహజ మేధా సంపన్నుడు.
ఆయన గారు,నోరు విప్పిఏమి మాట్లాడినా,చాతుర్యం పాలు సగమైతే, సాహసంపాలు మిగతా సగం ఆక్రమించి సంభాషణకి, సమగ్రతని, హుందాతనాన్ని, సంపాదించి పెట్టేవి.
ఆయన ఉదాత్త విగ్రహాన్నిచూసేటప్పటికే,క్రొత్తవాళ్ళ గుండెలు జారిపోయేవి.
ఏమంటే,తమకు ఏమి తంటా వస్తుందో?అని బిక్కు బిక్కుమంటూ 
ఆయన ముందు,అపరిచితులు నో మాట పెగలక నీళ్ళు నములుతూ ఉండే వారు.
ఇంగ్లీషులో ఆయనకున్న వాగ్ధాటి,భారతీయులకే కాక పాశ్చాత్యులకు కూడా నోటికి తాళం వేయించేది.
 అలాంటి ఆయన ఒకసారి,ఒక రాత్రి రైల్లో,ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేస్తున్నాడు.
ఆ పెట్టె మొత్తానికి ఆయన ఒక్కడే ఉన్నాడు.
తరువాత కొంత సేపటికి,ఒక స్టేషన్లో ఇంకొక దొర ఎక్కాడు.
ఇప్పుడా పెట్టెలో వాళ్ళిద్దరే ప్రయాణీకులు.
గోపాల కృష్ణయ్య కూడా, బ్రిటిష్ దొరలాగానే ఫుల్ సూట్లోఉన్నాడు.
దొర కంటే కాస్త ఒడ్డూ పొడుగూ,ఉన్నాడు మన గోపాల కృష్ణయ్య .
దొర ఒకసీట్లోకూర్చున్నాడు.కాలక్షేపానికి గోపాల కృష్ణయ్య , పెట్టెలోఅటునుంచి ఇటూ,ఇటునుంచిఅటూ, నిర్విరామంగా తిరుగుతున్నాడు.
ఆ బూట్ల చప్పుడు,దొరకు ఇబ్బందకరంగాతోచింది.
తిరగొద్దని చెప్పడానికి,దొరకి దమ్ములుంటేగా?
ఆ ధ్వని భరించ లేకుండా ఉన్నాడు.
ఇలా కొంత సేపు తిరిగి,తిరిగి ఆ తర్వాత ఆ బూట్లు విప్పి,అవి తన బల్లక్రింద పెట్టిహాయిగా నడుం వాల్చాడు.
కొంత సేపటికి గుర్రు పెట్టి మరీ నిద్ర పోతున్నాడు.
అప్పుడు దొర "ఇతను లేచాడంటే !,మళ్ళీ బూట్లు వేసుకొని,బండిలో తిరక్క మానడు.
మనకి న్యూసెన్స్ మొదలు కాక మానదు.
"అని తలపోసి, సైలెంటుగా ఆ బూట్లని బండి లొంచి,బయటకు విసిరేశాడు.
ఇంక పీడా విరగడైందనుకొని,తన కోటు తీసి,ఎదురుగా ఉన్న పెగ్గుకు తగిలించి,హాయిగా నిద్ర పోయాడు.
కాసేపటికి  గొపాల కృష్ణయ్య గారు నిద్ర లేచి,బూట్లు తొడుక్కుందామని చూస్తే,అవి అక్కడ లేవు.
మోత చేస్తున్నాయని,ఇతనే బయట పారవేసి ఉంటాడని గమనించి, అతన్నిద్ర పోతుండ గానే,పెగ్గుకి వ్రేలాడుతున్న అతని కోటును తీసి బయటకు విసిరేశాడు.
ఆ కోటు ఎంత ఖరీదయినదో,అందులో ఎంత అవసరమైన రికార్డు ఉందో,టికెట్టు వగైరాలు అందులోనే ఉన్నాయన్నవిషయం కూడా అతను గమనించలేదు.
అప్పుడు తాను మాత్రం వట్టి కాళ్ళతోనే,అటు నుంచి,ఇటూ తిరుగుతూ ఉన్నాడు.
కాస్సేపటికి దొర లేచి,తన కోటు,అక్కడ పెగ్గుకి కనపడక పోయే సరికి,ప్రాణాలు ఎగిరి పోయినంత పనైందతనికి.
కారణం అతని సర్వస్వం ఆ కోటు జేబులోనే ఉన్నాయి.
ఇప్పుడింక అతన్ని పలకరించకతప్పదని,What happend to my coat ?.....అని అడిగాడు.
గోపాల కృష్ణయ్య గారు "Your coat has gone out, in search of my boot."అని సీరియస్ గా అన్నాడు.
అతను నిర్ఘాంత పోయి,చేసేదేమీ లేక,లోలోపల ఏదో గొణుక్కుంటూ,అసహనంగా కూర్చున్నాడు.
                  అందుకే అంటారు పగ ఉన్న వాడిని తిడితే,
                  భక్తి ఉన్న వాడికి ఆ పాపం తగులుతుందని.
                                      

24, మే 2012, గురువారం

మా పాఠశాల 10 వ తరగతి 2012 పరీక్షా ఫలితాలు


ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి తాన్ని ఉదయిని
మొత్తం హాజరైన విద్యార్ధినీ విద్యార్ధులు :101
హాజరు కాని విద్యార్ధులు                        01
ఉత్తీర్ణులైన వారు:                                  86
ఉత్తీర్ణులు కానివారు:                             14
ఉత్తీర్ణతా శాతం:                                     86%
గత సంవత్సరం ఉత్తీర్ణతా శాతం:             83%
ఈ ఫలితాలు సాధించిన విద్యార్ధినీ విద్యార్ధులకు అభినందనలు.ఈ ఫలితాల సాధనలో నిరంతరం శ్రమించి కృషి సల్పిన
మా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులను తీర్చి దిద్దిన మా పాఠశాల సిబ్బందిని కొనియాడుతూ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి తాన్ని ఉదయిని గారి ప్రత్యేక కృతజ్ఞతాభినందన  మందారాలు.

అక్షరాలు,జన మానస, ఫలకాల,శిలాక్షరాలు!

సరస్వతీ నమస్తుభ్యం,వరదే కామరూపిణీ,విద్యారంభం కరిష్యామి,సిద్ధిర్భవతుమేసదా!
పల్లవి: అక్షరాలు,జనమానస,ఫలకాల,శిలాక్షరాలు,
      నిశానీల,మషీరసాల్,హరియించు,రసాక్షరాలు.


1చ.  శివఢమరుక నాదంలో,కురిసిన దైవాక్షరాలు,
      రసనాగ్రవిలాసి హొయల,విరిసెడు,భావాక్షరాలు,
      ఓ,నా,మా,లుగ,తొలుతగ,గిలికెడు,బీజాక్షరాలు,
      వాగర్ధ ప్రతిపత్తుల,కులికెడు,తేజో~క్షరాలు.....అక్షరాలు

 2చ  అజ్ఞాన,మహాంధకార,మడగించు,ప్రభాక్షరాలు,
      విజ్ఞాన విలోచనాలు,తెరిపించు,శుభాక్షరాలు,
      శ్రమజీవుల,నవజాగృతి,కలిగించు,మహాక్షరాలు,
      చైతన్య,మహామహస్సు,లొలికే,మధురాక్షరాలు...అక్షరాలు


 ౩చ. అమ్మఒడొని,బడి గుడిగా,నేర్చిన వెలుగక్షరాలు,
      తేట తెనుగు నుడికారము,కూర్చిన తెలుగక్షరాలు,
      తీపి గోరుముద్దలతో,చూపు ప్రేమముద్దులతో,
      తొలిగురువై,తనుమలచిన,సంస్కారసుధాక్షరాలు..అక్షరాలు

        
 4చ.  అక్షర,అక్షౌహిణితో,మానస రధమురికిద్దాం.
       జీవనసంగ్రామ రంగ,జయ కేతనమెగురేద్దాం.
       అనుభవాల పాఠాలను,అక్షరాల,వల్లిద్దాం,
       అక్షరాస్యతాసూచిని,ఊర్ధ్వదెసకు మళ్ళిద్దాం.....అక్షరాలు

22, మే 2012, మంగళవారం

కుక్క... కాపలా!

జన్మలన్నింట!మానవ జన్మఅనేది లభించడం ఎంతో!"దుర్లభం "అన్నారు ! పెద్దలు.అలాంటి ఈ గొప్ప జన్మలో పుణ్యం మాట దేముడెరుగు ! పాపాన్ని మూట కట్టుకోకూడదు ! వెనుకటి రోజుల్లో ! ప్రముఖ కాలేజీల్లోనూ , యూనివర్సిటీల్లోనూ , హైస్కూళ్ళలో లాగా ఒక తరగతి గదిలోనే  అన్ని సబ్జెక్ట్లూ  బోధించరు .గంట కొట్టగానే ,విద్యార్ధులు ఒక సబ్జెక్ట్ గది నుంచీ , మరో  సబ్జెక్ట్ గదిలోకి మారుతూ ఉండాలి .వెనుకటికి  "అపరిచితుడు " సినిమా హీరో లాంటి ,ఒక ఆదర్శ విద్యార్ధి ఉన్నాడు. అతను ఒకానొక ప్రముఖ యూనివర్సిటీలో , చదువు కుంటున్నాడు .అక్కడి ,పద్ధతులు , అలవాట్లూ , ప్రొఫెసర్ల లాలూజీ విధానాలూ ,అతనికి మాత్రమూ నచ్చలేదు .అతను బాగా చదువుకోసం !ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ,తల్లి దండ్రులను ఎంతో బాధ పెడుతూ,ఇక్కడకు చదువుకై వచ్చాడు. ఇలా ప్రొఫెసర్లు చదువు నేర్పక పోవడం చాలా...చాలా...బాధ అనిపించింది . అయినా తనొక్కడు ! ఏమి ? చేయగలడు ? 
               కాలేజీల్లో లాగా, యూనివర్సిటీల్లో " స్వేచ్చ" అనేదే ! ఉండదు.ఇక్కడి ప్రొఫెసర్లు విద్యార్ధుల పంచ ప్రాణాలూ ,తమ గుప్పిట్లో పెట్టుకుంటారు .ఎవరైనా ! ఏమైనా ! కాస్త ! తల బిరుసుతో !ఎదిరించాడా ! వాడిని నల్లిని నలిపినట్లు నలిపేస్తారు .పోనీ !వాళ్ళుక్లాసులో పాఠాలు సక్రమంగా బోధిస్తారా ? అంటే ! అదీ శూన్యమే ! విద్యార్ధులను , పురుగుల కంటా ! హీనంగా , బానిసల్లా ,చూస్తారు .ఏదో పేరుకి పాఠాలు అయ్యాయి అనిపిస్తారు కానీ ,"విద్యార్ధులకు ఏమాత్రం అర్ధం అయింది ? "అనేది వాళ్ళకు అనవసరం . వాళ్ళ జీతాలు వేలకు వేలు ,ఎలాగూ వస్తాయనే! "ధీమా " వారికి ఎలాగూ  ఉంటుంది. పైగా మీరు "లైబ్రరీల మీద పడండి ! రిఫరెన్సులు చూసుకోండి ! నోట్సులు వ్రాసుకోండి ! పరీ క్షలు వ్రాయండి ! "అంటూ హుకుంలు జారీ చేస్తారు .అదీ !అక్కడి వాతావరణం .అన్ని యూనివర్సిటీలు  ఇలా ఉంటాయనీ ! అందరు ప్రొఫెసర్లూ ! అలా ఉంటారని !నా భావం కాదు !సుమా !
                       ఇలా ఉండగా ,ఒక రోజున విద్యార్ధి యధావిధిగా, ఒక క్లాసులో నేర్చుకోవలసిన పాఠం అయిపోయింది .వేరొక రూములోకి విద్యార్ధులు మారుతున్నారు.ఆ వరండాలో ఒక "కుక్క " పడుకొని ఉంది కొందరువిద్యార్ధులు దాన్ని, చీ.!..చీ.!.చీ !...అంటూ కొడుతున్నారు అప్పుడు !మన తెలివైన  విద్యార్ధికి ఒక మంచి అవకాశం దొరికింది . పైగా అదే సమయానికి , ఒక ప్రొఫెసర్ కూడా అదే మార్గాన రావడం కూడా ఆతను గమనించాడు.వెంటనే విద్యార్ధి వాళ్ళను,కొట్టడం ఆపుతూ
"అయ్యయ్యో! కుక్కను !తోలకండిరా !బాబూ !అది ఎవరనుకున్నారు గత జన్మలో , కాలేజీలో పని చేసిన ,యూనివర్సిటీ !  ప్రొఫెసరే ! వేలకోద్దీ జీతాలు పుచ్చుకుని కూడా ,సరిగ్గా విద్యార్ధులకు పాఠాలు చెప్పక , అన్యాయంగా యూనివర్సిటీ ద్వారా ,మన సొమ్ము తిన్న పాపానికి , జన్మలో ! కుక్కలా !పుట్టి ,పూర్వ జన్మ సంస్కారం వల్ల , ఇక్కడే ! ఇలా ! కాపలా కాస్తున్నాడు." అందుకని దాన్ని మనం తోలకూడదురా! " అన్నాడు.అదే సమయానికి అటుగా వచ్చే ప్రొఫెసర్ ఆ మాటలు వింటాడని వేరొక విద్యార్ధి ,అతనికి సైగ చేసాడు .అతడికి తెలియదేమో ! అని .మొండి వాడైన ఆ విద్యార్ధి ," మరేం ! మునిగి పోలేదు లేవోయ్ ! నేను చెప్పింది ఏమీ అబద్ధం కాదు .ఎవరైనా గానీ , తాము ప్రతిఫలం పొంది కూడా ,తీసుకున్న జీతానికి ,న్యాయం చేయకపోవడం తప్పుకాదూ ! దానికి "గరుడ పురాణంలో  !ఇదే శిక్ష ! సూచించారట "  అని మా తాత చెప్పాడు లేవోయ్ ! " ఇది నిజంరా ! అని ఒక చిన్న అబద్ధం విసిరాడు . తనను తాను కాపాడుకోవడానికి .పాపం ! ఆ ప్రొఫెసర్ ఏడ్పు ముఖం పెట్టుకుంటూ ,గమనించీ గమనిం చనట్లు,  వెళ్ళిపోయాడు .ఆ విధంగా  తన అక్కసును బైట పెట్టాడా తెలివైన విద్యార్ధి.


         (ఇది ! హాస్యానికి  కేవలం !కల్పితం !ఎవరినీ ,ఉద్దేసించి  కాదు )





13, మే 2012, ఆదివారం

"అంపకాలు"కధా రచయిత - కొడవటిగంటి కుటుంబరావు

             

 
"అంపకాలు"కధా రచయిత - 
కొడవటిగంటి కుటుంబరావు

10 వ తరగతిలోకి రాబోతున్నవిద్యార్ధినీ విద్యార్ధులారా! 10వ తరగతి తెలుగు పాఠ్య గ్రంధంలో "అంపకాలు"అనే పాఠం ఉంది.అది ఒక మంచి కధ.దాన్ని ఒకసారి చదవండి!బాగుందికదా!మరి అది రచించిన  
కధా రచయిత - కొడవటిగంటి కుటుంబరావు.పై ఫోటో వారిదే!మరి వారిని గురించి ఈ వేసవి శలవుల్లో  కొన్ని ముఖ్య విషయాలను తెలుసు కుందామా?తెలుగు సాహిత్యంలో కధా రచయితగా, సంపాదకుడిగా ఒక ప్రత్యేక స్థానం ఆపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాల పాటు అతని కలాన కధలు వెలువడుతూనే ఉన్నాయి. ముప్పై ఏళ్ళ పాటు అజ్ఞాత సంపాదకుడిగా "చందమామ" పత్రికను నడిపించారు. 1950 - 1980 కాలం తెలుగు బాల సాహిత్యం సువర్ణాధ్యాయముగా మార్చారు. ఇలాటి ఘనత ఆపాదించిన వారు - కొడవటిగంటి కుటుంబరావు గారు. వీరు అభిమానులకు కో.కు. గా సుపరచితులు.కొడవటిగంటి కుటుంబరావు గారు ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలో అక్టోబర్ 28, 1909 లో జన్మించారు. 1925 వరకు తెనాలి లో చదువుకున్నారు. తల్లి తండ్రులను చిన్నతనం లోనే కోల్పోయారు.1927 లో ఏ సి కాలజి నుండి ఇంటర్మీడియట్ లో ఉత్తెర్ణులై విజయనగరం మహారాజా కాలేజి లో బి ఎస్ సి (ఫిజిక్స్) లో విద్యాభ్యాసం సాగించారు.ఈ తరుణంలో రచనా శక్తి పెరిగింది.ఎం ఎస్ సి (ఫిజిక్స్)నిమిత్తం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చేరారు, కాని పూర్తి చేయలేదు.తరువాత శింలా, ముంబై తదితర చోట్ల పలు ఉద్యోగాలు చేశారు.
ఉద్యోగ జీవితం:
1952 లో చందమామ పత్రిక నిర్వహణ చేపట్టారు. ఇది వారి జీవితానికి దిశామార్గం ఏర్పరచింది.తెలుగు సాహిత్యం ఒక కొత్త ఆవిష్కారానికి నాంది పలికారు - పిల్లల కధలు, సాహిత్యం పెంపొందించారు.తెలుగు నాట మునుపెన్నడూ లేని పిల్లల కధలు వెలువడ్డం మొదలైయ్యాయి.ఓ సువర్ణాధ్యాయానికి నాందీ పలికింది.ఈ ప్రవాహం అంతారాయం లేకండా నాలుగు దశాబ్దాల పాటు సాగింది.తెలుగు దేశంలో (భారతావని లో) తెలుగు అభిమానాదరణలు అందుకుంది.తెలుగు విద్యార్ధిని విద్యార్ధులలో (ఆమాటకొస్తే పిన్నా పెద్దలలో) ఓ కొత్త ఒరవడి స్థాపించిందిధి. సాహిత్యాభిమానం పెంచిది.తెలుగు కధల మీద మమకారం పరిపుష్టి చేసింది.ఈలాటి ఉదాహరణ, గత శతాబ్ధంలో మరొకటి లేదు. పండిత విష్ణు శర్మ పంచతంత్రం తరువాత అతి విశిష్టాదరణ, మన్నన, ఆదరణ గైకొన్న రచన మరోటి లేదు. అందులోనూ ఓ మాస పత్రికకు రెండు తరాల పాటు ఆదరణ లభించిన దాఖలాలు లేవు. ఆ కధలను చదివిన వారు - తెలుగు సాహిత్యాభిమాన సంఘ శాశ్వత సభ్యులు (లైఫ్ మెంబర్స్ / రీడర్స్ ఆఫ్ తెలుగు సాహిత్యం) అని నిస్సంకోచముగా చెప్పవచ్చు. ఇలాటి అపూర్వ అధ్యాయం, ఘట్టం రూపొందిచినవారు శ్రీ కో.కు గారు. తెలుగు భాషా, సాహిత్యం వీరికి ఈ విషయంలో రుణపడి ఉంటుంది.పేరు ప్రాపకం లేకుండా, తెర వెనుకనే ఉండి అవిరామ కృషి చేసి సత్ఫలితాలను అందిచారు. పిల్లల మనస్సులలో తెలుగు భాష పట్లా, కధల పట్ల అభిరుచి పెంపొందించారు. చందమామ మళ్ళీ ఎప్పుడొస్తుంది? టపాలో రాగానే ఎవరి చేతికి ముందు చిక్కితే వారు చదివేసి మరొకరికి చాన్స్ ఇస్తారు - ఉదారంగా!... చెప్పుకోడానికి గొప్పగా ఉంది కదూ. కాని ఇది తెలుగు దేశంలో ప్రతీ ఇంటిలో, ప్రతి నెలా జరిగే తంతే. సాహిత్యానికి అంత పట్టు ఉంది. ఇలాటి పట్టు ఆపాదించిన కో కు గారి రచనా కౌశలం, సంపాదకీయం అపూర్వం.
 రచనలు:
కొడవటిగంటి కుటుంబరావు కధలు
- కేతు విశ్వనాధ రెడ్డి ప్రకటన. ఇది చాల మంచి పుస్తకం. తెలుగు సాహిత్యాభిమానులు చదివి తీరాల్సినదే. అలాగే " కుటుంబరావు సాహిత్యం ", కేతు విశ్వనాధ రెడ్డి కో కు గారి కధాభిమానులు తెలుగు నాట చాలా మంది ఉన్నారు. కో కు కధలలో ఓ ప్రత్యేకత ఉంది - కధా వస్తువుకు సంబందించిన ప్రతీ చిన్న విషయం సైతం ఉపేక్షించకుండా వ్రాస్తారు. గొలుసు కధలు కూడా ఉన్నాయి. మగవారిలో ఉన్న నసుగుడు,ఆడవాళ్ళలో ఉన్న జడ్డితనం పట్టుకుని కధలలోకి చక్కగా రంగరించారు. ఈ ప్రక్రియ కధలకి వన్నె తెచ్చింది.  
కొడవటిగంటి కుటుంబరావు గారి, కొన్ని ముఖ్య రచనలు:
 దీపావళి రాజకీయాలు,వారసత్వం,గడ్డు రోజులు,ఐశ్వర్యం,సుందరం లేర్న్స్,బ్రతుకుభయం,అనుభవం,మరోప్రపంచం,పెళ్ళి చేయకుండా చూడు,ప్రేమించిన మనిషి,శాస్త్రీయ విజ్ఞానం,తిమింగలం వేట  
చిన్న కధలు:
చాలా మటుకు మధ్య తరగతి జీవితం, సగటు మనిషి అనుభావాలను వీరి కధలలో ముడి సరకుగా చెసుకున్నారు. కో కు గారు వ్రాసిన కొన్ని
చిన్న కదలు:
-కొత్త పద్ధతులు, పీడ కధ,అద్దె కొంప,కలసి రావాలి,నిరుద్యోగం,సద్యోగం,
అష్టకష్టాలు,ఉద్యోగం,మనము మేము,పైకి వచ్చిన వాడు,శీల పరిశీలన,
 కొత్త జీవితం,నువ్వులు - తెలకపిండి,షావుకారు సుబ్బయ్య.
నవలా రచనలు:
వారసత్వం,చదువు,జీవితం,పంచకల్యాణి,కొత్త అల్లుడు,మారు పేర్లు,
సరితాదేవి డైరీ,గ్రహ శకలం.
ప్రాచీన భారతం గురించి 58 వ్యాసాలు వ్రాసి - చరిత్ర వ్యాసాలు గా వెలయించారు.
"నాకు తెలసిన జీవితం గురించే నేను రాశాను" అని సవినయముగా చెప్పుకున్నారు కో కు గారు. "చెప్ప దగినది కాకపోతే కధ కాదు" అని ఓ సందర్బములో అన్నారు.
ఆగస్ట్ 17, 1980 లో తుది శ్వాస విడిచారు. తెలుగు సాహిత్యం, ముఖ్యముగా కధా రచన క్షేత్రంలో వీరి ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. చందమామ ఉన్నంత కాలం వీరి కధలు తారసిల్లుతూనే ఉంటాయి. ఇది వారి, తెలుగు వారి అదృష్టం!.