19, ఏప్రిల్ 2012, గురువారం

SCHOOL LIFE


బావా!తప్పుడు మాటలేల....

"కవి సార్వభౌమ" శ్రీనాధ మహాకవి
"సహజ కవి"బమ్మెర పోతన
శ్రీనాధుడు పోతన బావా,బావ మరదులౌతారని లోకంలో ప్రచారముంది.ఇద్దరూ మహా కవులే!ఇద్దరూ ఉద్గ్రంధ రచయితలే!
ఇద్దరూ జగత్ప్రసిద్ధులే. ఇద్దరూ మంచి ఉపాసనా పరులే.ఇద్దరూ బ్రహ్మజ్ఞాన సంపన్నులే.కానీ శ్రీ నాధుడు భోగ మార్గాన్ని,పోతన యోగ మార్గాన్నీ,యెన్ను కున్నారు.అదే వారిలో కొంచెం తేడా!శ్రీ నాధుని దృష్టిలో పరం మాట ఏమో గానీ,ఇహం మాత్రం సత్యం!బ్రతికున్నంత వరకూ,అన్నీ పుష్కలంగా అనుభవించాలనే తత్వం అతనిది.అందు చేతనే రాజులకీ, మంత్రులకీ,స్నేహితులకీ,పీఠాధిపతులకీ,ఎవరు కనబడితే వాళ్ళకల్లా తన గ్రంధాన్నిఅంకితమిచ్చివాళ్ళిచ్చినవన్నీ పుచ్చుకుని హాయిగా సుఖ భోగాలు అనుభవించి కవిసార్వభౌముడయ్యాడు.దీనార టంకాల తీర్థమాడాడు శ్రీ నాధుడు.తన "పలనాటి వీర చరిత్ర"ను అంకితం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు కాబోలును!చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చిభగవదంకితం అసలే చేయలేదనే అపప్రధనుండి తప్పించుకున్నాడు!
కానీ పోతన దీనికి పూర్తిగావ్యతిరేకం.
             ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు,వాహనమ్ములున్
          సొమ్ములు కొన్ని పుచ్చుకొని,చొక్కి,శరీరము వాసి,వాలుచే
సమ్మెట వ్రేటులంబడక,సమ్మతి శ్రీ హరికిచ్చి చెప్పెనీ
    బమ్మెర పోతరాజొకడు!భాగవతమ్ము! జగద్ధితమ్ముగన్.
అని తాను రచించిన మహోదాత్తమైన శ్రీమదాంధ్ర మహా భాగవత  పురాణాన్నిశ్రీ మన్నారాయణునకే అంకితమిచ్చి,తన జన్మను ధన్యం చేసుకున్నాడు భక్త కవి పోతన.
      శ్రీ నాధుని స్వభావానికి అపవాదంగా,ఏ పరిస్థితులలో నైతేనేమి? ఒక్క గ్రంధాన్నైనా భగవదంకితం చేసినట్లు,పోతన తత్వానికి విరుద్ధంగా చిన్నదో,పెద్దదో,ఏదో ఒక గ్రంధాన్నైనా నరాంకితం చేయకుండా వున్న వాడు కాదు.వేశ్యావర్ణన ప్రచురమైన తన భోగినీ దండకాన్ని సర్వజ్ఞ సింగ భూపాలుడికి అంకితం చేశాడు.ఐతే అది ఎప్పుడో,ఉడుకు రక్తం ఉప్పొంగే, చిన్ననాటి మాట!ఐనా!జీవితం యొక్క స్వచ్చతని మలినీకరించడలో పాత్ర వహిస్తూ సోకిన ఆ కొంచెం పాటి కళంకం కూడా కళంకమే. అందుచేతనే"ఇమ్మనుజేశ్వరాధముల"కివ్వ గూడదని నియమం పెట్టుకున్నాడు కాబోలు."రాజైన వాడు ఎవ్వడికీ ఇవ్వగూడదని కాక పోవచ్చును.రాజుల్లో అధములైన వాళ్ళకే ఇవ్వగూడదు. ఉత్తము లైతే ఇవ్వవచ్చునేమో!"అనేది అతని ఉద్దేశ్యంగా విశ్లేషించుకుంటే,సర్వజ్ఞ సింగ భూపాలుడు మాత్రం ఉత్తముడనడంలో ఏమాత్రం సందేహం లేదు.కానీ అతడే భాగవతాన్నితనకంకితమిమ్మని కబురు చేస్తే పోతన ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నాడని,రాజు హఠం చేసి,ఆ గ్రంధాన్ని బలవంతంగా తెప్పించి పాతి పెట్టించాడనే ఉదంతం మళ్ళీ దీన్నికొంచెం దెబ్బ తీస్తోంది.బహుశా!చిన్ననాడు ఉత్తముడనిపించిన ఆ రాజు పరిణతి వయస్సులో తనకి అధముడుగా గోచరించాడేమో! వయ:క్రమంలో అభిప్రాయాలు మారిపోవడం అసహజం కాదుకదా!
                అలాంటి పోతన దగ్గరికి శ్రీ నాధుడొకసారి వచ్చి "బావగారూ! మీరు భాగవతం వ్రాశారనీ,అది చాలా బాగుందనీ, వింటున్నాను.చాలా సంతోషం.కానీ నేను దానిని ఎప్పుడూ కనలేదు వినలేదు .ఏదీ!ఒక మాంచి ఘట్టం చదివి వినిపించండి!నాకు మీ కవితా విందు చెయ్యండి! అని కోరాడు.అప్పుడు పోతన గజేంద్ర మోక్ష ఘట్టం వినిపిస్తూ,మొసలి చేత పట్టుకోబడి,బహుకాలం స్వ సంరక్షణ విషయంలో చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కాగా సంపూర్ణ శరణాగతికి పాల్పడ్డ గజేంద్రుడు,
లావొక్కింతయులేదు,ధైర్యము విలోలంబయ్యె,ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను,మూర్చ వచ్చె,తనువున్ డస్సెన్,శ్రమంబయ్యెడిన్,
నీవే తప్ప నిత:పరంబెరుగ,మన్నింపందగన్ దీనునిన్,
రావే!ఈశ్వర!కావవే!వరద!సంరక్షించు!భద్రాత్మకా!
అని వేడుకొనేటప్పటికి విష్ణు భగవానుడు అతనికప్పుడు కుదిరిన అనన్య భక్తికి మెచ్చి,అతని కస్టానికి చలించిపోయి
సిరికిం చెప్పడు,శంఖ చక్రయుగమున్ సంధింపడే
పరివారంబును జీర,డభ్రగ పతిం బన్నింప,డాకర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు,వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు,గజ ప్రాణావనోత్సాహియై.
 వెంటనే శ్రీనాధుడు హేళన ధ్వనించే స్వరంతో ఏమిటేమిటీ?బావగారూ! భక్తుడు మహాపదలో చిక్కుకొని,ఆర్తనాదం చేశాడని జాలిపడ్డ ఆ జనార్దనుడు శంఖ చక్రాలే ధరించలేడా?పరివారాన్ని వెంట బెట్టుకోలేదా? కనీసం వాహనమైన గరుత్మంతుణ్ణి కూడా సిద్ధపరచుకోలేదా?ఏ సాధనమూ లేకుండా భక్తుణ్ణెలా రక్షిద్దామని వచ్చాడు?ఇది అతని స్వభావానికే విరుద్ధం.ఇలాంటి వర్ణనలు చేస్తే,సామాన్యుల మాటేమోగానీ, మాబోటి!మాన్యులు,సాహితీ మర్మజ్ఞులు మాత్రం మెచ్చుకోరు!అని ఆక్షేపించాడు.అధిక్షేపించాడు కూడా!
         శ్రీనాధుని మాటలకు పోతన కోపం తెచ్చుకోవడంగానీ,ఉడుకు మోత్తనం చూపడం కానీ,తన వాదాన్ని సమర్ధించుకోవడానికి ప్రయత్నించడం కానీ,ఏమీ చెయ్యక బావా!తప్పుడు మాటలేల?అని, ఊరికే ఒక చిన్నచిరునవ్వు నవ్వి,అప్పటికూరుకొన్నాడు.తరువాత అందరూ భోజనాలకు లేచే సమయంలో శ్రీ నాధుడు చుట్టం చూపుగా, తన ఇంటికొచ్చేటప్పుడు తనతో కూడా,వెంట బెట్టుకొని వచ్చిన అతని మనుమణ్ణి భద్రంగా ఒకచోట దాచాడు.ఒక పెద్ద బండ రాతిని నూతిలో పడవేసి అయ్యయ్యో!మీ మనుమడు నూతిలో పడిపోయాడని శ్రీ నాధుని దగ్గరకు వచ్చి,ఘొల్లుమన్నాడు మన పోతన.
                           శ్రీ నాధుడు విస్తరి ముందు కూర్చోబోయేవాడల్లా అయ్యో!అయ్యో!అంటూ గుండెలు బాదుకుంటూ,దొడ్లోకి పరుగెత్తుకెళ్ళి నూతి చుట్టూ పిచ్చెత్తిన వాడిలా తిరుగుతున్నాడు.అప్పుడు మన పోతన "ఇదేమి విడ్డూరం మహా కవీశ్వరా?కవిసార్వభౌమా!కేవలం తమ మనవడు నూతిలో పడిపోతే,ఒక నిచ్చెనకానీ,ఒక మోకుగానీ తీసుకురాకుండా,వాళ్ళనీ వీళ్ళనీ పిలవడం గానీ,ఏమీ లేకుండా!కేవలం గుండెలు బాదుకుంటూ పరుగెత్తుకొచ్చి,ఏ సాధనమూ లేకుండా మనవణ్ణెలా బయటకు తీసి,రక్షిద్దామనుకున్నారు?ఇది మీ  వంటి మాన్యులకు,వారి స్వభావానికి సముచితమా?అనుచితమా?అని 
దెప్పిపొడిచాడు.అప్పుడు శ్రీ నాధుడు సిగ్గుపడి బావగారూ!మీ భాగవత వర్ణన సహజమే!నేను చేసిన అహంకార పూరితమైన వ్యాఖ్యనుఇప్పుడే! ఉప సంహరించు కుంటున్నాను.నన్నుక్షమించు!ఆ సమయంలో ఉన్నవాడు ఉన్నట్టు రావడమే లోక సహజం!కానీ సాధన సామగ్రి కోసం తడుముకోవడం!అనుభవ సిద్ధం కాదు.అంటూ,ఇంతకీ నా మనుమడేడీ? అని అడిగాడు.అప్పుడు పోతన చిరు నవ్వు నవ్వుతూ,తానంతకు ముందు దాచిన చోటు నుంచి పిల్లాడిని తీసుకొని వచ్చాడు.వాడూ వస్తూనే తాత గారూ!అనిశ్రీ నాధుడి వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు. మనుమణ్ణి చూడగానే ఏనుగెక్కినంతగా సంతసిస్తూ,శ్రీ నాధుడు అతణ్ణి ఎత్తుకొని ముద్దాడాడు.

17, ఏప్రిల్ 2012, మంగళవారం

"ఎల్బీ శ్రీ రాం "ఎదురు రైలెక్కాడు...

అతని అసలు పేరు లొల్ల బాల శ్రీరాం ."ఎల్బోర్డ్  శ్రీరాం"మిత్రులంతా పిలిచే ముద్దు పేరది .అందరికీ ,తెలివి మెదడులో ఉంటే ,మన ఎల్బీకి తెలివి ,కొంచెం మోకాలికి దిగింది .అందుకే అతనికి ఆ ముద్దు పేరు సార్ధకం అయింది .అతనికి  ఎప్పటినుంచో  సినీమా యాక్టర్ కావాలని , చిన్నకోరిక .స్నేహితులంతా మద్రాస్ వెళ్ళి ట్రై  చేయమని చెప్పడంతో ,ఒక రోజు మూటా ముల్లె ,సర్దుకుని ,ఇంట్లో కూడా చెప్పా పెట్ట కుండా ,తెనాలి నుంచి ,మద్రాస్ రైలెక్కేశాడు.జెనరల్ కంపార్టుమెంట్లో అతని అదృష్టం కొద్దీ పైన పడుకునే జాగా కూడా దొరికింది."ఈ తెలివి తక్కువ దద్దమ్మ!"లోకంలో తన లాంటి ,మేధావి పుట్టడం నిజంగా !ఈ ప్రజల అదృష్టం ,"అని అతని ప్రగాఢ విశ్వాసం .అర్ధ రాత్రికి "నెల్లూరు "స్టేషన్ వచ్చింది .బండి ఆగినా ,అక్కడ ఎంతో సేపాగదు కూడా !అది తెలియని మన ఎల్బీ,తన బ్రీఫ్ కేసు తీసుకొని (ఎవరైనా పట్టుకు పోతారని ) భోజనం కోసం బండి దిగాడు .క్యాంటిన్ లో భోజనం చేసి ,హాయిగా కిల్లీ కట్టించుకొని ,నముల్తూ జల్సాగా ,నిక్కి నీలిగి ,తిరిగి  బండి దగ్గరికి వచ్చాడు.ఆలోగా చెన్నైవెళ్ళే బండి వెళ్ళిపోవడం ,అదే ప్లాట్ ఫాం మీదకు హౌరా వేళ్ళే బండి రావడం కూడా  జరిగిపోయింది .ఇది అతనికేమీ తెలియదు.తాను అంత క్రితం దిగిన బండే గదా !అనుకున్నాడు పాపం .
                   మెల్లగా ఒక పెట్టెలోకి ఎక్కాడు.పై బల్ల మీదికి చేరి ,బ్రీఫ్ కేసు తలక్రింద పెట్టుకొని ,పడుకున్నాడు .కాసేపటికి బండి కదిలింది .క్రమంగా బండి స్పీడందుకుంది.తాను పడుకున్నబల్లకె దురుగా నీటుగా టక్ చేసుకున్న,ఒక పెద్ద మనిషి పక్క పరుచుకోని ,దాని మీద కూర్చుని , తాపీగా సిగరెట్టు ముట్టించాడు .అతన్ని చూసి మన వాడు తిన్నగా ఉండక ,పడుకున్న గాడిదను ,లేపి తన్నించు కున్నట్లు గా ,"మీరెక్కడికి వెడుతున్నారు "?అని అడిగాడు మన మహామేధావి .అతను" వాల్తేరు" అని చెప్పాడు .ఆ మాట వినగానే ,ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టడానికే , తానూ అవతరించిన ట్లు మన ఎల్బీశ్రీ రాం , ఒక్క !వింత నవ్వు !నవ్వి , "తనలో తాను ,ఆ హా ! సైన్సెంత గొప్పగా అభివృద్ధి చెందింది ?ఒకే బండిలో నేను పడుకున్నఈ బల్ల.... చెన్నై వెడుతుంటే , ఎదుటివాడు పడుకున్నబల్ల....వాల్తేరు వెళుతూ ఉందన్నమాట ఇంకా ముందు ముందు ,ఎంత అభివృద్ధి చెందుతుందో ?నా చిన్నప్పటికీ ఇప్పటికీ , ఎంత తేడా !అనుకుంటూ మెల్లగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
                   చాలా సేపటికి టీ.సీ వచ్చి మన ఎల్బీని లేపి టిక్కట్టు అడిగాడు . అతను దర్జాగా తీసి ,చూపించాడు .అది చూసి టీ.సీ "ఇదేమిటి ? చెన్నైకి టిక్కెట్టు కొనుక్కుని ,హౌరా బండిలో ఎక్కావ్ ? "అన్నాడు.అందుకతను ,ఈ హౌరా ఏమిటి ?నేను బండెక్కడమేమిటీ ?ఆ వాల్తేరు వెళ్ళేది ఎదర బల్ల ! నేను పడుకున్నబల్ల ! చెన్నైవెళ్ళేదేగదా? అన్నాడు.బండిలో ప్రయాణిస్తున్న వాళ్ళు అందరూ ఒక్కసారి పొట్ట చెక్కలయ్యేలా !గొల్లున నవ్వారు. టీ .సీకి దిమ్మ తిరిగి పోయింది .అతను దిగ్భ్రాంతి నుండి తేరుకొనే లోగానే , "రాజమండ్రి " స్టషన్ వచ్చింది."చాల్చాల్లేవయ్యా ? పెద్ద మనిషివి ! దిగు ! చెన్నై వెళ్ళే బండి రేపు మధ్యాహ్నంవస్తుంది.అప్పటికీ టిక్కెట్టు!పనికి రాదు.ఇంకో  టిక్కెట్టు కొనుక్కుని ,వెల్దువుగాని !ఈ రాజముండ్రీ లో !దిగు !అని బలవంతాన దింపేశాడు .ఆ రైలు కాస్తా వెళ్ళిపోయింది.మన ఎల్బీఅర్ధంతరంగా పాపం! రాజమండ్రీ చేరాడు.అందుకే నన్ను" ఎల్బోర్డు  శ్రీరాం అని ఊరికే అనరు ! మన గడుగ్గాయిలు !అని వాపోయాడు ,తన తెలివి తక్కువ తనాన్ని తలచుకుంటూ......

10, ఏప్రిల్ 2012, మంగళవారం

మా పాఠశాల 2011-2012 విద్యా సం.లో 10తరగతి వ్రాసిన విద్యార్ధినీ విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ బృందం

"A "సెక్షన్ విద్యార్ధినీ విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ బృందం 
"B" సెక్షన్ విద్యార్ధినీ విద్యార్ధులు మరియు ఉపాధ్యాయ బృందం