25, డిసెంబర్ 2014, గురువారం


                           జాతీయ గణిత దినోత్సవం
                                 
శ్రీ శ్రీనివాస రామానుజం
 
మా పాఠశాలలో ఈనాటి జాతీయ గణిత దినోత్సవం ఆహ్లాదకర సుందర వాతావరణంలో మానూతన  ప్రధానో పాధ్యాయులు శ్రీ టి.వెంకట కుమార్ గారు నిర్వహించారు.సాయంత్రం సరిగ్గా 3.45 ని.లకు మా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధుల బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి శ్రీ శ్రీనివాస రామానుజం జయంతిని ఘనంగా జరుపుకున్నాం.గణిత నిష్ణాతులైన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెంకట కుమార్ గారు చక్కని ఉపన్యాస ధోరణితో శ్రీ రామానుజన్ జీవిత విశేషాలను విద్యార్ధులకు సమూలంగా అందించి ఈ సభను ఆకట్టుకున్నారు.వారి ఉపన్యాస సారాంశం............
               ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే రామానుజం జన్మ దినోత్సవాన్ని కెంద్రం జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడమే! రామానుజం వంటి మేధావి ఇప్పటికీ ఎవరూ పుట్టలేదన్నారు.రామానుజం తక్కువ కాలం జీవించినా,ఆకాశంలో మెరిసిన మెరుపు క్షణ కాలం ఉంటుంది. అది చాలా ప్రకాశవంతంగా వెలుగులీనుతుంది.అలాగే రామానుజంకూడా కొద్దికాలం మాత్రమే జీవించినా,ఎన్నో అద్భుతాలు సృష్టించాడు అని వివరించారు.ఎలా? ఎందుకు? అని ప్రశ్నిస్తే, శాస్త్రజ్ను లౌతారనీ,ఎప్పుడు?ఎక్కడ జరిగింది? అంటే చరిత్ర కారులౌతారన్నారు. రామానుజం చిన్నతనంలో పలకకుకూడా  నోచుకోక నేల మీదనే వ్రాసి చెరిపేవాడని,అందు మూలంగా అతని చేతులు కాయలు కాసేవని వివరించారు.ఎంతో కష్టపడి ట్యూషన్లు చెప్పిడబ్బుసంపాదించి చదువుకున్న అతి సామాన్యుడని చెప్పారు.టీచర్లు కూడా సాధించలేని గణిత సమస్యలను అతి సునాయాసంగా పరిష్కరించి చూపేవాడన్నారు. దీనికి అతని ఏకాగ్రత మూలకారణమని చెపుతూ,పిల్లలు అలాంటి ఏకాగ్రతను అందుకోవాలని సూచించారు.ఒక పీద్ద సమస్యని (లెక్కని) సులభ పద్ధతిలో కేవలం పది వరుసల్లో సాధించి చూపితే అది యే రీతిలో సాధించాడొతెలుసుకోవడానికి ఇతరులు తలలు పట్టుకొనే వారని వివరించారు.తన అభివృద్ధికి కారణం ఎప్పుడూ "నామగిరి దేవి" అని తమ కుల దేవతను ఎప్పుడూ తలుచు కునేవారు.గణితంలో చూపినంత శ్రద్ధ ఆరోగ్యం పట్ల చూపక పోవడం వల్ల అతనిని "క్షయ వ్యాధి" ఆవహించిందని వివరించారు.రామానుజన్ ను రాయల్ సొసైటీలో సభ్యత్వం వరించిందని, జె.సి.బోస్,మేఘనాధ్ సాహ,హోమీ బాబా,వంటివారు తర్వాత అందుకున్నారని తెలిపారు.శీతల దేశం కారణంగా ఇంగ్లండ్  లాంటి  దేశం వైద్యం అతనికి  సరిపడలేదు.ఇలాంటి  మేధావిని  కోల్పోతామా!అని హర్డీ కూడా ఎంతో  బాధపడేవారట.జబ్బు పడికూడా మంచంమీదనే గణిత సమస్యలను సాధిస్తూ వాటిని హర్డీకి పంపించేలా ఏర్పాటు చేసుకున్నారట. మద్రాసు విశ్వవిద్యాలయం అతని  జీవనం నిమిత్తం 250 పౌండ్లు  పంపగా ఇండియాలో నాకు 60 పౌండ్లు సరిపోతాయని,మిగిలినవి కుదిరితే బీదలకు,చిన్న పిల్లల ఆరోగ్యానికి పంపమన్న  త్యాగశీలి.                                               అలాంటి  మన శ్రీనివాస రామానుజన్ 1920 ఏప్రిల్ 26  న  పరమ పదించారని, రామానుజన్  మన దేశంలో  పుట్టీనందుకు మనం  గర్వపడాలని  తమప్రసంగాన్ని విరమించారు. అనంతరం మరొక గణిత  సహోపాపాధ్యాయులు శ్రీ తాతయ్య  మరికొన్ని  రామానుజం జీవిత విశేషాలను  తెలియజేశారు.జనగణమన తో ఈనాటి ఈ కార్యక్రమం ముగిసింది.                                              


                                 మా బడిలో స్వఛ్ఛభారత్



2, జూన్ 2013, ఆదివారం

ఎస్.చిక్కాల సమీప గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులారా ! గమనించండి !....అడుగు ముందుకు వెయ్యండి మరి!


మా పాఠశాల SMC సభ్యులతో ప్రధానోపాధ్యాయులు 
శ్రీ G.T.వెంకట కుమార్ గారి సమీక్షా సమావేశం
ప్
మా పాఠశాల విద్యా సంబరాలలో 11-14 సం.ల బాలబాలికలను చేర్పించ కోరుతూ మా ప్రగతిని తెలిపుతూ క్రొత్త విద్యార్ధినీ విద్యార్ధుల తల్లిదండ్రుల సమాచారానికై ప్రచురించిన కరపత్రం
 విద్యా సంబరాలలో  భాగంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మా పాఠశాల 95%సాధించిన ప్రగతిని,
ఆయా విద్యార్ధుల  GPA లను సగర్వంగా ప్రకటించుకుంటున్నాం!

1, జూన్ 2013, శనివారం

మంచి పిల్లలూ!......గురువు దేవునితో సమానమా?....... కాదా?.....

                     నిజానికి గురువు దేవునితో సమానం కాదు.
                  ఎందుకంటే!గురువు దేవుని కంటే ఎంతో గొప్పవాడు.
కేవలం దేవుడు నమ్మకంతో ముడిపడ్డాడు..మన శ్రీ గురువు కనుల ముందు కనుపించే మహనీయుడు.మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువుల ఋణం ఒక్కటే! అందువల్లనే "మాతృదేవోభవ""పితృదేవో భవ"అన్న తరువాత ఆచార్యదేవోభవ" అని చెప్పి గురువు స్థానాన్ని తెలియజేశారు.మన పూర్వీకులు. తల్లి,తండ్రి తరువాతస్థానం గురువుదే!దైవత్వాన్ని కూడా గురువు ద్వారానే దర్శించవలసి ఉంటుంది.
                         అజ్ఞాన తిమిరాంధస్య,జ్ఞానాంజన శలాకయా,
                         చక్షురున్మీలితంయేన తస్మైశ్రీ గురవేనమహ:.
అజ్ఞానమనే గ్రుడ్డితనాన్నిజ్ఞానమనే కాటుకనిచ్చి కనులు తెరిపించిన శ్రీ గురువులకు నమస్కారములు అని శ్లోకా
ర్ధమూ ,అదే లోకార్ధమూ కూడా!బ్రిటిష్ పాలకుల రాకతో గురు కులాలు,గురుకుల విద్యాభ్యాసాలు పోయాయి."మెకాలే దొర"విద్యా పద్ధతిలో గురు మర్యాదలు పూర్తిగా పోయాయి.పూర్వకాలం గురువుగారు కూర్చుంటే శిష్యులు నిలుచుండి పాఠాలు వినేవారు.ఇప్పుడు కాలి బూట్లతో శిష్యులు కూర్చుని ఉంటే గురువు గారు నిల్చుని పాఠాలు చెప్పాలి.
(దీనినే మెకాలే పద్ధతి"అంటారు.)
విద్య వ్యాపారమైంది ఈ నాడు.చదువుకునే వారు తగ్గిపోయారు. చదువుకొనే వారు రెచ్చిపోతున్నారు.ఎప్పుడైతే విద్యా బోధనకు విలువలు తగ్గి,విద్యాలయాలు వ్యాపార సంస్థలుగా మార్పు చెందాయో అప్పుడే గురువులు గుండ్రాయిలయ్యారు.నేడు గురువులు 'మాష్ట
రు' అయ్యారు.ఇప్పుడింకా మరి కొద్దిగా క్రిందకు దిగి 'సార్'లు అయ్యారు.
అయ్యో! గురువా!నీకెంత దుర్గతి పట్టిందయ్యా!
ఈ మార్పుకి కేవలం శిష్యులే కారణం కాదు.గురువులు కూడ ఎంతో కొంత కారణమవుతున్నారు.విద్యాలయాల్లో కూడా కులవివక్షను చూపిస్తున్నారు.వ్యాపార ధోరణిని ప్రదర్శిస్తున్నారు.ఇపుడు విద్యాలయాలు విజ్ఞాన నిలయాలు కావు.ఆర్జనా నిలయాలుగా మారి, బ్రతుకుదెరువు మార్గాన్ని మాత్రమే బోధిస్తున్నాయి.

                              "యధాగురు:తధా శిష్య:"
ఏది ఏమైనా గురుస్థానం గురువుదే కదా!గురువును దేవునిగా భావించి సాగిలపడి దండాలు పెట్టకపోయినా ఏనాడైనా,ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురుపడితే,అభిమానంగా పలకరించండి!గురువులు కోరుకొనేది ఇంతే!మనం గొప్పవాళ్ళమయ్యామని,ప్రయోజనపరులయ్యామని,వారికి తెలియజేసి చూడండి!హృదయ పూర్వకంగా ఎంత సంతోషిస్తారో!మీ కళ్ళతో మీరే చూడండి!ఏది ఏమైనా గురూపకారం మరువలేనిది అని మీరే గుర్తిస్తారు.అలాగే మనల్ని కన్న తల్లిదండ్రుల్నికూడా మరవకూడదు.వారి తర్వాతే గురువు మరి!

21, మే 2013, మంగళవారం

పాలకొల్లు మండలంలో ద్వితీయస్థానం


2012-13 వ సంవత్సరంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పాఠశాల విద్యార్ధి చి.కూనప రెడ్డి సాయి మణికంఠ పాలకొల్లు మండలంలో ద్వితీయస్థానాన్ని సంపాదించాడు.అలాగే మా పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 95శాతం సాధించడమే కాకుండా ర్యాంకుల్లో సాయి మణికంఠ 97.5,వీర నాగ మణికంఠ 9.దేవడ హరిత,భావన సునీత,సిద్దాని లక్ష్మీ దుర్గ,అడ్డగర్ల రాజు,నాగ పెద్దింట్లు 9కంటే అధికంగా ర్యాంకులు సాధించారని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము.

26, జనవరి 2013, శనివారం

పాఠశాలలో చదివే10వ తరగతి విద్యార్ధులకు పౌష్టికాహార పంపిణీ

విద్యార్ధినీ విద్యార్ధులతో గ్రామస్థుల ముఖాముఖీ
కార్యక్రమానికి ఆసీనులైన మా గ్రామ పెద్దలు,పౌష్టికాహార దాతలు

ప్రధానోపాధ్యాయులు వెంకట కుమార్ గారి సందేశం
పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్ధులకు సాయంత్రం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఇటీవలా మా చిక్కాల గ్రామస్థుల ఆర్ధిక సహకారంతో ప్రారంభించడం జరిగింది.కార్యక్రమానికి మా ఊరి దాతలు 1600/- రూపాయలు సహాయంగా ప్రకటించారు.99మం.విద్యార్ధి చదువుకు ఏ ఆటంకం లేకుండా చూడమని నూటికి నూరు శాతం ఉత్తీర్ణతా శాతం తీసుకు రావాలని మీకు మేము,మరియు ఉపాధ్యాయులు ఎల్లవేళలా సహకరిస్తామని గ్రామస్థులు తమ సందేశం ద్వారా వివరించి మీరు మనకీ మనఊరికీ ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్ధినీ విద్యార్ధులకు "పులిహోర"అందజేసి లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పాఠ శాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి.టి.వెంకట కుమార్ గారు మా పాఠశాల విద్యార్ధులు మీకు కౄతజ్ఞతా పూర్వకంగా నూటికి నూరుశాతం ఉత్తీర్ణతను కానుకగా అందజేస్తామని గ్రామస్థులకు హామీ అందజేశారు.కష్టాలు ఎన్నో వస్తాయి.వాటిని తట్టుకుంటూ ముందుకు పోవాలని,రాబోయే కరెంటు కోతను దౄష్టిలో ఉంచుకుని బడిలో నిర్వహించే అదనపు తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానో పాధ్యాయులు వివరించారు.గడచిన త్రైమాసిక పరీక్షలలో 60 శాతం ఉత్తీర్ణతను ఈ అర్ధ సంవత్సర పరీక్షలలో 75 శాతానికి తీసుకొని రాగలిగిన విద్యార్ధులను అభినందించారు.అలాగే ఈ గ్రాడు విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని,ఇదే ఉత్సాహంతో మరొక్క మూడు నెలలు కౄషిచేస్తే ఫలితాలు నూటికి నూరు శాతం తేగలమని వారి ఉపన్యాసంలో వివరించారు.
ఈ అభి వౄద్ధి సాధకులైన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ బృందానికి కౄతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమానికి ఆదరంతో హాజరై మా పాఠశాల క్రమక్రమాభి వౄద్ధిని లోకానికి అందజేస్తున్న పాత్రికేయ మిత్రులకు తమ అభినందనలు తెలియజేశారు.ఆ కార్యక్రమ చాయా చిత్రాలను మా విద్యార్ధులు,ఉపాధ్యాయులు దర్శించేలా ఉంచుతున్నాము.ఆనందించండి.
ప్రధానో పాధ్యాయుల సూచనలు,సలహాలు
గ్రామస్థులతో ప్ర.ఉ.పా వారి ప్రణాలికా చర్చలు

గణితోపాధ్యాయులు ఎస్.తాతయ్యగారి కృతజ్నతా సందేశములు
క్రమశిక్షణతో వింటున్న విద్యార్ధి బృందం
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్న 
శ్రీ దాదరాజు గారు
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్నదాతలు
ప్రధానోపాధ్యాయుల వారి సమీక్షా సమావేశం

క్రమశిక్షణతో వింటున్న విద్యార్ధినీ బృందం

26, డిసెంబర్ 2012, బుధవారం

ఆరనీకు!.....మన తెలుగు వెలుగు......!

మన తెలుగు నసిస్తోంది అంటూ ముక్కున వేలేసుకొని మరీ స్పందించే ప్రతి వ్యక్తీ "దానికి కారణం మనమే"అనే నగ్న సత్యాన్ని గుర్తించాలి

సుమించి పరిమళించే మన తెలుగు వృక్షాన్ని వ్రేళ్ళతో సంబంధాలు లేకుండా చేస్తున్నది అక్షరాలా నేటి మన మమ్మీ డాడీలే! వీరి వైఖరిలో మున్ముందు మార్పు రావాలి."నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం"అంటూ చిన్న తనం నుంచీ చేసిన ప్రతినలు నిజం చేయాలి.


8, డిసెంబర్ 2012, శనివారం

బహుమతి ప్రదానోత్సవం

ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహాణలో భాగంగా నిన్న కవితల పోటీలో గెలుపొందిని మా పాఠశాల విద్యార్ధిని అందుకున్న బహుమతి చిత్రాలు.నేటి విద్యార్ధినీ విద్యార్ధులకు స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ఆ చిత్రాలను వెలువరిస్తున్నాను.
సభావేదికనలంకరించిననరసాపురం  రెవిన్యూ డివిజనల్ అధికారి,పాలకొల్ కమీషనర్,మరియు మండలాభివృద్ధి అధికారివారలు.


పాలకొల్లు మండలాభివృద్ధి అధికారి మరియు స్పెషల్ ఆఫీసర్ నరస రాజు  హరితకు బహుమతిని అందజేస్తున్న చిత్రం

7, డిసెంబర్ 2012, శుక్రవారం

తెలుగు మహా సభల సందర్భంగావివిధ పోటీలలో వి జే త లు

మండల స్థాయి కవితల పోటీలో గెలుపొందిన మాపాఠశాల చిరంజీవిని దేవాడ హరిత
పాలకొల్లు మండల స్థాయి పోటీల నిర్వహణను సమీక్షిస్తున్నమునిసిపల్  కమీషనర్,
మండల విద్యాశాఖాధికారి శర్మగారు,మరియు వివిధ పోటీల న్యాయనిర్ణేతల సమావేశం
ప్రపంచ తెలుగు మహాసభా నిర్వహణలో భాగంగా ఇటీవల మండల స్థాయిలో వ్యాస రచన,వక్తృత్వం,చిత్ర లేఖనం,పద్య పఠనం,స్వీయ కవితా రచన,మొదలైన పోటీలలో పాల్గొన్న మా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు.వీటిలో డి.హరిత 10వ తరగతి అమ్మాయి మండల స్థాయి కవితల పోటీలో ప్రధమ స్థానాన్ని పొంది,డివిజన్ స్థాయికి ఎంపిక కాబడింది.ఇది మా పాఠ శాలకు ఎంతో గర్వకారణమని ఇటీవలే నూతన ప్రధానోపాధ్యాయునిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన కుమార్ గారు మరియు ఇతర ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం హరితను అభినందనల వర్షంలో ముంచెత్తారు.ఆ చిత్రాలివి.
చిరంజీవులు -సుకుమార్, పృధ్వి రాజ్, దుర్గ, దేవాడ హరిత, సునీత, హేమశ్రీ,  లక్శ్మీదుర్గ.

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కృతజ్ఞుడు-కృతఘ్నుడు

కృతజ్ఞుడు అనగా చేసిన మేలు మరువని వాడు.అలాగే కృతఘ్నుడు అంటే చేసిన మేలు మరచిపోయేవాడు.మరి ఈ ఇద్దరికి భేదం తెలుసు కొనేలా ఒక కధ ఉంది                         
             ఒక ఊరిలో ఒక రాజు గారున్నారు.ఆయనని కొందరు కృతజ్ఞుడు అంటున్నారని, మరికొందరు కృతఘ్నుడు అనుకుంటున్నారని  చారులు తెలిపారు.రెండు పదాలూ ఇంచు మించు ఒకేలా మనందరికీ కనపడుతున్నా,అసలీ కృతజ్ఞుడు-కృతఘ్నుడు అనే పదాలకు అర్ధం ఆ రాజుకు మాత్రం సరిగా తెలవలేదు.తెలుసు కోవాలనే అతని మనస్సులో కుతూహలం.వేంటనే తన మంత్రిని కేకవేశాడు."నాకు ఈ రెండు పదాలకి అర్ధం సరిగా అర్ధం అయ్యేలా,ప్రత్యక్ష పూర్వకంగా రేపు నువ్వు! దీన్ని  నిరూపించడానికి ఆధారాలేమైనా తీసుకురా"అని ఆజ్ఞ జారీ చేశాడు. చిత్తం!మహ ప్రభో!అని పైకి అన్నాడేకాని,లోలోన కుములుతున్నాడు, ఏమి తేవాలో ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో అని.అదే ఆలోచనతో ఇంటికి వచ్చాడు.తెగ ఆలోచిస్తున్నాడు.ఆధారం ఏదీ ఎంత ఆలోచించినా దొరకలేదు.రేపు రాజు గారితో తన పనిఅయిపోయినట్లే!అని మనసులో కొంచెం భయం కూడా పట్టుకుంది.తల బ్రద్దలు కొట్టుకుంటున్నాడు.ఇలా ఉండగా ఆ మంత్రి గారికి ఎంతో తెలివైన ఒక కూతురుంది.తండ్రి డీలా పడి ఉండడాన్ని మొఖంలోనే గమనించి కారణం తెలుసుకుంది.                                          "ఓస్!ఇంతేనా!దానికి అంత తల కొట్టేసు కోసుకోవలసిన పనిలేదు.రేపు మన పెంపుడు కుక్కను,మీ అల్లుడు గార్ని రాజ సభకు తీసుకెల్లండీ!మీ సమస్య చాలా సులభంగా పరిష్కారం అవుతుంది" అని చెప్పి హాయిగా నిద్ర పొమ్మన్నది.
                                    మన మంత్రి గారికి,తన కూతురి ద్వారా అలా మంచి ఆధారం ఇంత సునాయాసంగా దొరకడంతో హాయిగా నిద్ర పోయాడు.మరునాడు ఎప్పటిలా తెల్ల వారింది.తన పెంపుడు కుక్కను, తన అల్లుణ్ణి,రాజ సభలో ప్రవేశపెట్టి ఇలా అన్నాడు."అయ్యా!మీరు తీసుకుని రమ్మన్నఆధారాలు తీసుకొని వచ్చాను"అన్నాడు.అక్కడకు తెచ్చిన ఆ ఆధారాలను చూసి,మంత్రి తనను ఎగతాళి చేస్తున్నాడని రాజు గారికి కోపం వచ్చింది.అప్పుడు మంత్రి,రాజుతో ఇలా అన్నాడు.....

                              "మహా రాజా!ఈ ప్రాణికి ఎంత పెట్టినా "సంతృప్తి" అనేదే లేదు. ఇతని దాహం తీరదు.విశ్వాసం లేదు. మహా రాజా!ఒక విధంగామీరూ,నేనూ కూడా ఒకప్పటి ఒక ఇంటి అల్లుళ్ళమే కదా!మన అత్త మామలు మనకు చేసిన మేలు అప్పుడే,మరచిపోయాము.మరి!ఈ కుక్కను చూడండి! ఇది మాత్రం ఏది పెడితే,అది తింది.ఎంతో విశ్వాసం తోఉంది.నేటికీ మన ఇంటికి కావలి కాస్తూనే ఉంది"అన్నాడు.
                          మంత్రి గారి సమాధానం ఆ రాజుకు చాలా బాగా నచ్చింది.ఇంత గొప్పగా చెప్పిన మంత్రిని ఎంతో ఘనంగాసత్కరించాడు. నిజానికి ఆ సన్మానం దక్క వలసింది తన కూతురుకేనని మనస్సులో భావించాడు ఆ మంత్రి.మనం పరులు చేసిన ఉపకారాన్ని ఎన్నటికీ మరువకూడదని,అలాంటి వాడు కృతజ్ఞుడని,చేసిన మేలు కాస్తా మరచి పోయినవాడు
కృతఘ్నుడనీఆ రాజు ఈ విధంగా తెలుసు కోగలిగాడు. అలా అక్షరాల్లో కొద్ది తేడాతో కనపడుతున్నా ఈ రెండు పదాలకూ ఎంత భేదముందో!

17, సెప్టెంబర్ 2012, సోమవారం

నేటి తల్లి దండ్రుల బాధ్యత

చాలా మంది తల్లిదండ్రులు ఈనాడు మా పిల్లలు మంచి సాహిత్యం, చదవాలి .వారిలో మానవతా విలువలు ,సాంస్కృతిక విలువలు పెరగాలి,ఆధ్యాత్మిక చింతన ప్రబలాలి, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక విలువలతో  మా  బిడ్డల శీల సంపదలు ఇనుమడింప చేయాలనే భావనే కానీ , అవి పెంపొందించడానికి మన వంతుగా ,మనమెంత కృషి చేస్తున్నాము?అనే ప్రశ్న నేటి సమాజంలోని ప్రతి తల్లీ,తండ్రి వేసుకో వలసిందే!మన వంతు బాధ్యతలను మనం సక్రమంగా ఎంత వరకూ నిర్వర్తిస్తున్నామా?అని !ఈ నాడు మేము నవ నాగరికులమని బోర విరుచుకొని చెప్పుకుంటున్న,వారి గృహాలు ఎక్కడ చూసినా ,సెక్స్ సాహిత్యం ,క్షుద్ర సాహిత్యం ,అర్ధ నగ్న దృశ్యాలతో కూడిన పనికి మాలిన  సాహిత్యం ,డిటెక్టివ్ -నవలా సాహిత్యంతో,నిండి పోతూనే ఉందనే విషయం నేడు ఎవరూ కాదనలేరుగా?మరి !మన భావి తరాలెలా?తీర్చి దిద్దబడతారు?మనసు పెట్టి,కొంచెం ఆలోచించండి! సంస్కృతం,తెలుగు వంటి మన ప్రాచీన భాషలు పూర్తిగా మనకే రాక పోవచ్చును.నేర్చుకోవాలనే కోరిక  మరియు అభిలాష కొందరికి  ఏకోశానా లేకపోవచ్చును.మహాను భావులు ఎందరో మన కవులు ఎంతో పరిశ్ర మించి,కేవలం తెలుగు వచనంలోకి అనువదించిన అద్భుతమైన పూర్వ కావ్యాలు ఎన్నిలేవు?పురాణాలెన్ని లేవు? వాటిని కొంచెం సేపైనా ప్రతి రోజూ చదివించ వచ్చుగా?వాటిలో కొన్నైనా , అధమ పక్షం ఇంట్లోనైనా కొని, మన బిడ్డ చూసేలా ఉంచవచ్చుగా! గృహమొక పవిత్రమైన గ్రంధాలయంగా చేసుకోవచ్చుగా!వాటిని కొని ఇంట్లో ఉంచితే ఎప్పుడైనా ఒకసారి కాకపోతే వొకసారైనా ,వాడు తెరచి చూచే అవకాశం మనం కల్పించవచ్చుగా!భావి తరాలకు మంచి పుస్తకాలు ,సంస్కృతీ సాంప్రదాయాలు ,పుణ్య పురుషుల చరిత్రలు , అందించి,మన జాతిని జాగృతం చేసుకుందాం!ఇది తల్లి దండ్రుల మైన మనందరి బాధ్యతగా గుర్తెరిగిన వారు ధన్యులు.అందరినీ ఉద్దేసించి చెప్పిన విషయాలుగా భావించకండి!కొన్నిగృహాలు ఇందుకు భిన్నంగా మన ప్రాచీన ఆర్ష సాంప్రదాయపు ఒరవడిలో ఉండి ఉండవచ్చుకూడా ! అలాంటి వారికి నా జోహారులు.మన బిడ్దల నైతిక విలువల కోసం వేసవి ప్రత్యేక తరగతుల కోసం వేలకు వేలు ఫీజులు పోస్తున్నాం!వారిని ఉద్దేసించి మాత్రమే నా బాధ !మన్నిస్తారుగా!

5, సెప్టెంబర్ 2012, బుధవారం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః..........

 పిల్లలూ!నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని జన్మదినంకదా!ఈ రోజునే  మరొక పండుగకూడా ఉంది ఏమిటో చెప్పగలరా?అదే ఉపాధ్యాయ దినోత్సవం.అది డాక్టర్ సర్వేపల్లి వారి జన్మ దినం నాడే ఎందుకు చెయ్యాలి?మరొక రోజు చెయ్యవచ్చు కదా!అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది.మరి దానికి నేను సమాధానం చెప్పాలి కదా! ఆయన శిష్యులు,మిత్రులు కొందరు డాక్టర్ సర్వేపల్లి గారి వద్దకు వెళ్ళి అయ్యా!మీ జన్మ దినోత్సవాన్ని మేము ఘనంగా వేడుకగా చెయ్యాలని అనుకుంటున్నాము.దానికి మీరు అనుమతించాలి అని అడిగారు.అదీ ఆయన 74 వ జన్మదినం.అంటే అది 5 సెప్టెంబర్ 1962 వ సంవత్సరం. దానికి ఆయన ఇలా అన్నారు."నా పుట్టిన రోజును అంత వేడుకగా జరపడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు.నేను మీకు అధ్యాపకునిగా చిర పరిచితుణ్ణి .కాబట్టి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేనెంతో గర్హిస్తాను"అని చెప్పి,ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను, గౌరవ భావాన్ని వ్యక్తం చేశారు.అదుగో !అది !ఆ దినం నుండి ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.మరి ఆయన జన్మ దినమైన ఈ ఉపాధ్యాయ దినోత్సవ సమయాన వారిని గురించి,వారి గొప్పదనాన్ని గురించి,నాలుగు ముక్కలు మననం చేసుకోవడం మన విధి.
                  మద్రాసుకు 64 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి అనే ఒక ఊరుంది.ఆ ఊర్లో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలోవీరా స్వామి, సీతమ్మ పుణ్య దంపతులకు ది.5 సెప్టెంబర్ 1888 వ తేదీన జన్మించారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్.వీరి మాతృభాష మన తెలుగే !బాల్యం అంతా తిరుత్తణి,తిరుపతి పట్టణాల్లోనే సాగింది.మద్రాసులో స్నాతకోత్తర  విద్యను,M.A పట్టాను పొందిన వీరికి చిరు ప్రాయంలోనే అంటే 18 సం.ల వయస్సు లోనే అంటే 1906లోశివ కామమ్మ గారితో వివాహం అయింది.వీరికి 5గురు కుమార్తెలు,ఒకే ఒక్క కుమారుడు సంతానంగా కలిగారు.
                            క్రమంగా తత్వ వేదాంత శాస్త్రాలను ఆపోసన పట్టి అధ్యాపక వృత్తిలోకి అడుగు పెట్టారు.వారి ప్రతిభా పాటవాలను ఇనుమడింపచేసుకున్న వీరిని ,ఎన్నెన్నో అత్యున్నత పదవులు కోరకుండానే వెతుక్కుంటూ వచ్చాయి.ఒక అధ్యాపకునిగా వీరు చేపట్టిన పదవులు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది.మదన మోహన మాలవ్యా అడుగుజాడల్లో బనారస్ విశ్వ విద్యాలయానికి కులపతిగా,వాల్తేరులోని మన ఆంధ్ర విశ్వ విద్యాలయ కులపతిగా,  కలకత్తా విశ్వ విద్యాలయ రూపకర్తగా,ఆక్స్ఫర్డ్  విశ్వ విద్యాలయంలో స్పాల్డింగ్ ఆచార్యునిగా ఎనలేని గౌరవాన్ని,ఎందరెందరో గొప్ప గొప్ప శిష్యులను తన ఆస్తిగా సంపాదించుకున్నారు.1954లొ"భారత రత్న" అయ్యారు.1951 లో యునెస్కో రాయబారిగా వెళ్ళారు.జర్మన్ శాంతి బహుమతిని గుడా పొందిన వీరి మొట్టమొదటి రచన "ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్"ఇలాంటి వెన్నోఎన్నెన్నో వారి రచనలు భారతీయ సరస్వతికి కంఠాభరణాలు  అయ్యాయి.
                           కలకత్తా విశ్వ విద్యాలయంలో కింగ్ జార్జ్ చైరును అలంకరించిన తొలి భారతీయుడు మన డాక్టర్ సర్వేపల్లి. తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా,మహా పండితునిగా,ఉన్న మన రాధా కృష్ణునికి  1931 లో నైట్ హుడ్ ఇచ్చి గౌరవించారు.అప్పటి నుండి సర్ బిరుదు చేర్చి పిలువబడుతూ ఉండేవాడు.అలాగే రష్యా అధినాయకుడైన స్టాలిన్ కు తత్వాన్ని,జ్ఞానోపదేశం చేసి ఘనత మన డాక్టర్ సర్వేపల్లికి దక్కింది.
                                        రాజనీతికోవిదుడైన మన
డాక్టర్ సర్వేపల్లి స్వాతంత్ర్యా నంతరం మొట్ట మొదటి ఉప రాష్ట్ర పతి పదవి,ఆ తరువాత రాష్ట్ర పతి పదవి వీరిని వరించింది.వారికి గౌరవ సూచకంగా మన రాజధాని నగరంలో ట్యాంక్ బండ్ మీద వీరి శిలా మూర్తి ప్రస్ఫుటంగా చూపరులకు మనకు కనువిందు చేస్తూ ఉంటుంది. మూర్తీ భూత భారతీయ సంస్కృతి,వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి డాక్టర్ సర్వేపల్లి. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అంటరు సర్వేపల్లి. ఎంత గొప్ప స్థానాన్ని చేరినా సరే!విద్యార్ధిగా ఉండు!అంటారు వారు. అలాగే ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము.ప్రేమాభిమానాలతోనే చల్లార్చ గలమంటారు.అలాంటి మన సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని గూర్చి ఎంత చెప్పుకున్నా తరగని చరిత్ర వారిది.అలాంటి వారి జన్మ దినాన్ని ఈనాడు వారి కోరినట్లు ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా ఘనంగా జరుపుకోవడం నిజంగా వారి గొప్ప మనసుకు నిదర్శనం. వారి అడుగు జాడల్లో మనమందరం నడుస్తూ ,మీ మీ ఉపాధ్యాయుల్ని వారి సేవలను,కొనియాడుతూ మీ గురుభావాన్ని ప్రకటించుకుంటారని మనసా వాచా కర్మణా ,కోరుతూ వారి అడుగుజాడల్లో మీరంతా గొప్పవారు కావాలని కోరుకుంటూ,వారికి నా వినమ్ర ప్రణామాలను అందజేస్తూ,నా గురుదేవులందరికి, పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపు కుంటున్నాను.
                                                                   

1, సెప్టెంబర్ 2012, శనివారం

"దండం దశ గుణం భవేత్"

ఇటీవల ఒక మిత్రుడు తన మాటల్లో,"దండం దశ గుణం భవేత్" అంటారు గదా!దండం పెట్టడం పది రకాలట గదా ! అ దండాల గురించి కొంచెం చెపుతారా ? అని నా మీద,ఒక ప్రశ్నా బాణాన్ని సంధించాడు. నాకు చాలా ఆశ్చర్యమేసింది!ఇదేమిటి? దండం ఏమిటి ?పది రకాలేమిటి?అని.ఆతను భావించినట్లుగా ,ఇక్కడ" దండం " అంటే, మీరు కూడా నమస్కారం అనుకుంటారేమో?ఇక్కడ "దండం "అంటే,"చేతి కర్ర" అని అర్ధం."దండ ప్రమాణం" అనే మాట కూడా ఇందులోంచి వచ్చినదే! ఇది పూర్వ కాలం గురువుల చేతుల్లో,ఎక్కువగా చిన్న సైజులో కనుపించేది.దాన్ని" బెత్తం " అని మా రోజుల్లో పిలిచేవారు.అలాగే , చిన్నికృష్ణుడు  గోవులను మేపుతూ,విమల శృంగము,వేత్ర దండము ధరించాడని,పోతన మహా కవి భాగవతంలో వర్ణించాడు కూడా .మా రోజుల్లో విద్యార్ధులకు, సగానికి సగం, క్రమశిక్షణ దీని ,ద్వారానే అలవడేది.అంటే! మీరు నమ్ముతారా?భయానికి మారు పేరుగా ఈ దండం..నాడు ఉపాధ్యాయుల చేతుల్లో,తరచూ ఇది కనుపిస్తూ ఉండేది.
                                    ఇప్పుడు దీని పేరెత్తినా,ఇది చేతిలో కనిపించినా, ఉపాధ్యాయులను శిక్షించమని! ప్రభుత్వం వారు ఉత్తర్వులు దఖలు పరిచారు.అది వేరే విషయం అనుకోండి!.అలా అంటే,మీ వంటివారు కూడా,ఎంతమంది ఉపాధ్యాయులు బిడ్డల్నిశిక్షించడం లేదు ?ఎన్ని కేసులు చూడడం లేదు? అంటూ నన్ను ప్రశ్నిస్తారు.ఐతే ఇక  అసలు విషయానికి వద్దాం!ఈ" కర్ర " మనకు సన్యసించిన ,స్వామీజీల, అవధూతల,అఘోరాల, చేతిలో,పొడవైన దండం లాంటిది,మనం చూస్తూ ఉంటాం.దానికి కాషాయ వస్త్రాలు కూడా చుట్టి ఉంటాయి.అందుకే వారిని" త్రిదండి "వంటి గౌరవ పదాలను ముందుంచి, పిలుస్తూ ఉంటాము.వారి మనో, వాక్, కాయ రూపాలను ఈ దండంగా  భావించి,మనం ఈ పేరుతొ గౌరవిస్తూ ఉంటాం.మనం వారికి చేసే,ప్రతీ నమస్కారమూ, ఈదండం ద్వారా భగవంతునికి చేరుతుందని,భక్తుల నమ్మకం.ఇలా చెప్పుకుంటూ పోతే... ఈ దండం,మనకు 10 రకాలుగా నిత్య జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది.కాబట్టే 
" దండం దశ గుణం భవేత్" అనే వాక్యం వచ్చింది.ఆ పది ఉపయోగాల లోక భావాన్ని కలిగిన,ఒక  చిన్న శ్లోకాన్నిఇక్కడ మనం ముచ్చటించుకుందాం.
                                           "  విశ్వా~మిత్రా~హి, పశుషు,
                                                కర్దమేషు ,జలేషు చ,
                                                 అంధే,తమసి వార్ధక్యే,
                                                 దండం దశ గుణం భవేత్."
 అంటే!నిత్య జీవితంలో,మానవునికి ఈ దండం అనేది 10 రకాలుగా  ఉపయోగపడుతోంది.
1. "వి "=అనగాపక్షులను,అదలించడానికి,
2" శ్వ" =అనగా కుక్కలను ,బెదరించడానికి,
3. "అమిత్ర "=అనగా శత్రువులనుండి ఆత్మ రక్షణ పొందడానికి,
4. "అహి "=అనగా పాములనుండి,రక్షణ పొందడానికి,
5."పశుషు "=పశువులను,అదలించడానికి,
6 "కర్దమేషు "=అనగా బురద వంటి ప్రదేశాల్లో, పడకుండామన కాపుకోసం,
7. "జలేషు "=జలాలలో దిగినప్పుడు,లోతు,తెలుసుకోవడానికి,
8." అంధే"=కనుచూపు లేనివారికి,ఊతగాను
9. "తమసి "=చీకటిలో ,రక్షణగాను,
10."వార్ధక్యే "=ముసలితనంలో ,ఊతంగాను,
ఇలా ఈ దండాన్ని ఉపయోగించుకోవచ్చును.అని చెబుతాం.ఈ దశ గుణాలను మనం రోజూ అనుభవిస్తూ ఉన్నా,ఆ విషయాన్ని వదిలేసి,కేవలం నేడు" వీధిజనభయంకరుల " చేతుల్లో,ఆయుధాలుగా మాత్రమే మనం ఊహించుకుంటూ, ఈ దండానికి మనమే,విపరీతార్ధాలుతీస్తున్నా,ఈ అసలు అర్ధాలను గమనించమని నా మిత్రునితో చెప్పిన విషయం, అందరికీ  ఉపయోగిస్తుందని మీతో ఈ రోజు ఇలా ప్రస్తావించాను.ఇందులోని మంచిని గ్రహించండి.చెడునివిసర్జించండి.

31, ఆగస్టు 2012, శుక్రవారం

మన జిల్లా కలెక్టర్ మరియు మన జిల్లా విద్యా శాఖాధికారి

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్న చేస్తున్న అధికారులు అనధికారులు
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్న చేయిస్తున్నమన జిల్లా కలెక్టర్ మరియు అధికారులు
  మన జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ ఆర్.నరసింహా రావు, M.A,B.Ed

29, ఆగస్టు 2012, బుధవారం

అబ్రహం లింకన్ ఉపాధ్యాయులకు వ్రాసిన లేఖ

                  అబ్రహం లింకన్ ఉపాధ్యాయులకు వ్రాసిన లేఖ
ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు.
కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను.
ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండ ఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు.చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్దలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి.కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.
 ప్రియమైన ఉపాధ్యయులారా, నా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి, కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ
మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ వాడు నేర్వాలని నాకు తెలుసు.కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని
ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి
ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండిమాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి
ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి.
మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి
సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి
అయితే అదే సమయంలో...
ఆకాశంలోని  పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి.
ప్రకృతిని వాడు ఆరాదించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి

వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి
దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు  విలువ ఎక్కువని వాడికి చెప్పండి
వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి
వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే
సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి
అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు
గుడ్డిగా అనుసరించక ప్రకక్కు నిలబడగలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండిఎవరు ఏది చెప్పిన, వినడాన్ని భోదించండి అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, 
పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.
మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి
ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి
కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి
వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి
అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి
అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి
కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.
సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు
లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి
వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాభం, ఎత్తుకు తిప్పటం  చేయకండి
వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి
ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి
అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది.
ఇవ్వన్ని వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.
ఇదంతా పెద్ద పట్టికే, తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక.. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను.
కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి,,, వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు
జాగ్రత్తగా చూసుకోండి....

15, ఆగస్టు 2012, బుధవారం

మా పాఠశాలలో జరుపుకున్న66 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల చిత్రా మాలిక

              స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు
తరగతి గదుల అలంకరణ

తరగతి గదుల అలంకరణ

తరగతి గదుల అలంకరణ

జాతీయ పతాకావిష్కరణ

అల్లూరి విగ్రహ పూజ

స్వాతంత్ర్య దినోత్సవ సభ

పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు

స్వాగత గీతాలాపన

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

తిలకిస్తున్న విద్యార్ధినీ విద్యార్ధులు

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం

       2011-12 పదవ తరగతి ప్రతిభామూర్తులకు సన్మానం

                       2011-12 పదవ తరగతి                                            ప్రతిభామూర్తులకు సన్మానం